అవును మీరు చదివింది నిజమే. రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత వివాదాస్పదంగా మారిన రెండు బర్నింగ్ ఇష్యూస్ విషయంలో ఎవరూ ఎట్టిపరిస్ధితుల్లోను నోరిప్పేందుకు లేదంటూ బిజెపి జాతీయ నాయకత్వం నుండి రాష్ట్ర నేతలకు ఆదేశాలొచ్చాయి.  జాతీయ నాయకత్వం ఆదేశాలు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,  మీడియా చర్చల్లో పాల్గొనే అధికార ప్రతినిధులతో పాటు ప్రతి నేతకు కచ్చితంగా వర్తిస్తుందంటూ స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.  తల్లిపాలు తాడకుండా లేగదూడకు మూతిని కట్టేసినట్లయిపోయింది బిజెపి నేతల పరిస్ధితి తాజా ఆదేశాలతో. నిజానికి కన్నాతో కలిపి కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలకున్నా స్వేచ్చ తరహాలో తామిష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏ విషయం తీసుకున్నా పార్టీ నేతల్లోనే రెండు మూడు వాదనలు వినిపిస్తున్నాయి.

 

దశాబ్దాలుగా పార్టీలోనే ఉన్న నేతల వాదన ఒకలాగుంటోంది. మొన్నటి ఎన్నికల తర్వాత టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన నేతల మద్దతుతో కొందరు నేతలు మాట్లాడుతున్నారు. దాంతో తాము ఏ వాదన వినిపించాలో అర్ధంకాక తటస్ధంగా ఉండే నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదం, మూడు రాజధానుల ఏర్పాటు వివాదంపై కమలంపార్టీలోని నేతల్లో భిన్న వాదనలు బయటపడ్డాయి.  ఒరిజినల్ బిజెపి నేతలేమో కేంద్ర నాయకత్వం సూచనలను పాటిస్తు వాదనలు వినిపిస్తున్నారు. అయితే కన్నా లాంటి కొందరు నేతలు మాత్రం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నారు. విషయం ఏదన్నా కానీండి జగన్ను వ్యతిరేకించటమే కన్నా అండ్ కో పనిగా పెట్టుకున్న విషయం అర్ధమైపోతోంది.

 

కన్నా లాంటి వాళ్ళకు జగన్ వ్యతిరేక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరి కారణంగానే అనే ఆరోపణలు బిజెపిలోనే వినబడుతున్నాయి. ఇదే అంశంపై వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డితో పాటు చాలామంది నేతలు సుజనా- కన్నా బంధంపై బాహాటంగానే విరుచుకుపడుతున్నారు. కన్నాను సుజనా ఎందుకు మ్యానేజ్ చేస్తున్నాడంటే చంద్రబాబునాయుడు కారణంగానే అని విజయసాయి ఎన్నిసార్లు ఆరోపించాడో లెక్కలేదు. కోట్ల రూపాయలకు చంద్రబాబుకు కన్నా అమ్ముడుపోయాడని విజయసాయి బాహాటంగానే చేస్తున్న ఆరోపణలు అందరికీ గుర్తుండే ఉంటాయి. చంద్రబాబుకు కన్నా అమ్ముడుపోయాడనే ఆరోపణలతో పార్టీకి జరుగుతున్న డ్యామేజీని బిజెపి అధిష్టానం చాలా ఆలస్యంగా గుర్తించింది.

 

వైసిపికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని అనుకుంటున్న బిజెపికి కన్నా వైఖరి చాలా నష్టం చేస్తోందని గుర్తించిన జాతీయ నాయకత్వం వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. అందులో భాగంగానే రాజధాని, నిమ్మగడ్డ అంశాలపై ఎవరూ నోరిప్పేందుకు లేదని కట్టడి చేసింది. ఊహించని విధంగా జాతీయ నాయకత్వం నుండి వచ్చిన ఆదేశాలు కన్నా అండ్ కో కు చాలా ఇబ్బంది పెట్టేవనటంలో సందేహం లేదు. అదే సమయంలో కన్నా లాంటి బలమైన మద్దతుదారుడి సహకారం కోల్పోవటం కూడా చంద్రబాబుకు షాకనే చెప్పాలి.

 

జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు ట్విట్టర్లో ఓ ఆరోపణ చేసినా లేదా మీడియా సమావేశంలో మాట్లాడినా వెంటనే కన్నా కూడా అవే ఆరోపణలను జగన్ పై రిపీట్ చేస్తున్నాడు. అంటే సొంతబుద్ధితో కాకుండా చంద్రబాబు కోసమే జగన్ పై ఆరోపణలు చేస్తున్నాడనే విషయం జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. దాంతో అంతంతమాత్రంగానే ఉన్న కమలంపార్టీ పరిస్ధితి మరింతగా దిగజారిపోయింది. ఈ విషయాన్ని జాతీయ నాయకత్వం చాలా ఆలస్యంగా గుర్తించింది. ఇదే విషయమై సీనియర్ నేత మాట్లాడుతూ జరగాల్సిన డ్యామేజంతా జరిగిపోయిన తర్వాత జాతీయ నాయకత్వం మేల్కొన్నట్లు వ్యాఖ్యనించాడు. మొత్తానికి చంద్రబాబుకు కమలంపార్టీ పెద్ద షాకిచ్చిందనే చెప్పాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: