ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రెండు, మూడు రోజుల నుంచే బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక విమర్శలతో ఉక్కిరిబిక్కిర చేస్తున్న విషయం తెలిసిందే.  ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో తరచూ విద్యుత్తు కోతల మీద గులాబీ బాస్ కేసీఆర్ మొదలు ఆ పార్టీ ముఖ్య నేతలు తరచూ దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


రాష్ట్రంలో కరెంట్ కొరత లేదని.. కావాలని అకారణంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరం అయితే విధుల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు సచివాలయంలో విద్యుత్తు అధికారులతో సమావేశం అయిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొంత మంది విద్యుత్తుపై దుష్ర్రపచారం చేస్తున్నారని.. ఉద్దేశ పూర్వకంగా అప్రతిష్ట పాలు చేసేందుకు కరెంట్ కోతలు విధుస్తున్నారనే సమాచారం తమకు ఉందన్నారు.


అయితే గతంలో గ్రామాల్లో కరెంట్ పోతే విద్యుత్తు అధికారులను తిట్టుకునేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఇప్పుడు నాయకుల్ని.. పార్టీలను తిట్టడం ప్రారంభించారు. రేవంత్ లాగే జగన్ పాలన చేపట్టిన తొలినాళ్లలో ఇలాంటి సమస్యలే వచ్చాయి. విద్యుత్తు సంస్థ ఆయన ఆధీనంలో లేదు. దీంతో కింది స్థాయి ఉద్యోగులు బిల్లులు ఇష్టారాజ్యంగా కొట్టేవారు. పైకి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచలేదని ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం బిల్లులు తడిసి మోపడయ్యేవి.


దీంతో సహజంగా మధ్య తరగతి వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.  కానీ దీనిపై జగన్ అంతగా దృష్టి సారించలేదు. దీంతో బాదుడే బాదుడు వంటి నినాదాలతో టీడీపీ ప్రజల్లోకి వెళ్లింది. మరోవైపు ఇదే సమయంలో ప్రజలు జగన్ ని విమర్శించారు కానీ అధికారులని కాదు. ఇప్పటికీ అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికి దీనిపై సమీక్షలు జరపడం లేదు. తెలంగాణాలో సీఎం రేవంత్ రెడ్డి మాదిరిగా ఏపీలో కూడా జగన్ చేయాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: