బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలను జైల్లో పెట్టాలనే ఆలోచన బీజేపీకి ఎన్నడూ లేదని స్పష్టం చేశారు. ఈ కేసుకు బీజేపీ లేదా ప్రధాని మోదీకి ఎలాంటి సంబంధం లేదని, ఈడీ స్వతంత్రంగా విచారణ జరుపుతోందని ఆయన తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీల పేర్లను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చడంపై దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ధర్నాలు చేసిందని, ఇది రాజ్యాంగాన్ని, చట్టాలను అగౌరవపరిచే చర్య అని ఆయన తీవ్రంగా ఖండించారు.

కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నేషనల్ హెరాల్డ్ పత్రిక 2008 వరకు నడిచి, ఆర్థిక సంక్షోభం పేరుతో మూసివేయబడిందని వివరించారు. ఆ పత్రికకు సంబంధించిన విలువైన ఆస్తులను కేవలం 50 లక్షలకు యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ కొనుగోలు చేసిందని, ఈ కంపెనీ ద్వారా సోనియా, రాహుల్ గాంధీలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ కేసులో ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభించిందని, ఆరోపణలు తప్పు అయితే కోర్టు కేసును కొట్టివేస్తుందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి, ప్రజాధనాన్ని దోపిడీ చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఈడీ చర్యలను రాజకీయంగా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ నిరసనలు చేయడం సరికాదని, చట్టపరమైన విచారణను గౌరవించాలని బీజేపీ డిమాండ్ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కాంగ్రెస్ నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, ఈడీ చర్యలను రాజకీయ కోణంలో చూడటం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చట్టం తన పని తాను చేస్తుందని, న్యాయస్థానం తగిన తీర్పు ఇస్తుందని ఆయన నొక్కిచెప్పారు. కాంగ్రెస్ ఈ విషయంలో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని, అయితే బీజేపీ ఈ అంశంలో చట్టపరమైన ప్రక్రియను మాత్రమే సమర్థిస్తుందని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: