
గత ఏడాది నుంచి తరచూ ఢిల్లీ పర్యటనలు నిర్వహిస్తూ, కేంద్ర మంత్రులను కలుస్తూ, రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తూ లోకేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్లడం, అక్కడ బీజేపీ సహా ఎన్డీఏ మిత్రపక్షాల నేతలతో భేటీలు జరపడం ఆయన రాజకీయ ప్రాధాన్యాన్ని పెంచుతోంది. ఇటీవల కేంద్ర మంత్రులతో పాటు ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌ను కలిసి అభినందించడం, ఆయనను కూటమి తరఫున బలమైన నాయకుడిగా అభివర్ణించడం లోకేష్ భవిష్యత్ పాత్రను సూచిస్తోంది. అంతేకాకుండా, ఢిల్లీలో ఎన్డీఏలోని ఇతర మిత్రపక్షాలతో కూడా ఆయన చర్చలు జరపడం గమనార్హం. ఈ పరిణామాలను విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తూ, రాబోయే ఎన్నికల నాటికి లోకేష్ పూర్తి స్థాయిలో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే నాయకుడిగా నిలుస్తారని అంచనా వేస్తున్నారు.
మిత్రపక్షాల సమన్వయం విషయంలోనూ లోకేష్ ముందుకు వస్తున్నారు. టిడిపి పార్లమెంటరీ సభ్యులతో పాటు జనసేన ఎంపీలను కలుపుకుని సమావేశాలు నిర్వహించడం, కీలక నిర్ణయాలను చర్చించడం ఆయన వ్యూహాత్మక ఆలోచనలకు నిదర్శనం. దీని వల్ల టిడిపి ప్రాధాన్యం ఎన్డీఏలో మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. రాజకీయ వర్గాల్లోనూ, టిడిపి నాయకుల మధ్య కూడా తరచూ ఒకే మాట వినిపిస్తోంది. చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో పార్టీకి ప్రాతినిధ్యం వహించగల నాయకుడు నారా లోకేష్ మాత్రమే. ఆయనకు లభిస్తున్న గుర్తింపు, కేంద్ర రాజకీయాల్లో వేసే అడుగులు ఆయన భవిష్యత్‌ను జాతీయ స్థాయికి తీసుకెళ్తాయని అంటున్నారు.