మన జీవితంలో కొన్ని బంధాలు రక్తసంబంధాలకంటే ఎక్కువ స్థాయిలో నిలిచిపోతాయి. అలాంటి అద్భుతమైన బంధం స్నేహం. ఇది లాభనష్టాల లెక్కలతో కూడిన సంబంధం కాదు. ఇది హృదయాల మధ్య నడిచే పవిత్రమైన అనుబంధం. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన పురాణాల్లో నిలిచిపోయిన స్నేహపు గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే.. ఆ గాథలు ఇప్పటికీ రక్తమాంసాల మధ్య స్నేహానికి బలమైన నిర్వచనాలుగా నిలుస్తున్నాయి.


శ్రీకృష్ణుడు – కుచేలుడు: శ్రీకృష్ణుడు ఒక రాజ్యాధిపతి అయినా, బాల్యంలో తన పక్కన చదువుకున్న కుచేలుడు పేదవాడని తలచకుండా, తనను కలిసినప్పుడు ప్రేమతో ఒడిచాపుచ్చుకున్నాడు. అతను తీసుకువచ్చిన రెండు గుప్పెళ్ల అటుకులను అపారమైన విలువగా భావించి, అతని పేదరికాన్ని తుడిచిపెట్టాడు. ఈ స్నేహం చెబుతోంది – డబ్బు, హోదా, కులం లాంటి గీతలు స్నేహానికి అడ్డు కావు.



కృష్ణుడు – అర్జునుడు: ఇది స్నేహంలో జ్ఞానాన్ని కలిపిన ఋషి బంధం! కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఒక్కసారిగా మానసికంగా విఫలమైనప్పుడు, శ్రీకృష్ణుడు అతనికి భగవద్గీత రూపంలో జీవితం మీద గ్రేట్ క్లారిటీ ఇచ్చాడు. మంచి స్నేహితుడు అంటే, మనలో ఆత్మవిశ్వాసం నింపి, జీవిత బాటను చూపించేవాడిగా ఉండాలి అని ఈ బంధం చెబుతోంది.



కర్ణుడు – దుర్యోధనుడు: ఇది మాటకు కట్టుబడి నిలిచిన స్నేహం! కర్ణుడు, సమాజం నుంచి అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు, దుర్యోధనుడు అతనికి మిత్రుడిగా రాజగౌరవం ఇచ్చాడు. దానికి కృతజ్ఞతగా కర్ణుడు చివరి శ్వాస వరకూ దుర్యోధనుడి పక్షాన నిలిచాడు. ఇది మనకు చెబుతోంది – మన కోసం నిలిచిన వారిని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు.



శ్రీరాముడు – సుగ్రీవుడు: ఇది పరస్పర నమ్మకానికి ప్రతీక! శ్రీరాముడు, సీతమ్మను వెతకాల్సిన క్షణంలో సుగ్రీవుడు అనే వానరరాజుతో మైత్రి కట్టుకున్నాడు. అతనికి సహాయం చేసి రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు. మారుగా సుగ్రీవుడు తన వానరసైన్యాన్ని రాముడి కోసం అంకితమయ్యేలా చేశాడు. ఇది పరస్పర సహకారంతో విజయాలు సాధ్యమవుతాయని నిరూపిస్తుంది.



ఈ పురాణ స్నేహాలు మనకు ఒక విషయం చెబుతున్నాయి: నిజమైన స్నేహం అనేది స్వార్థం లేకుండా తోడుగా నిలిచే బంధం. అవసరంలో అండగా నిలిచే వాడే నిజమైన మిత్రుడు. ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా, మన జీవితాల్లో ఉన్న నిజమైన మిత్రులను గుర్తు చేసుకుని… “ధన్యుడిని!” అని మనసారా భావించాలి. స్నేహం అనేది మాటలో చెప్పే విషయం కాదు… హృదయంలో నిలిచిపోయే అనుభూతి!

మరింత సమాచారం తెలుసుకోండి: