
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, బండ్ల గణేష్ లాంటివారు హాజరై చిత్ర బృందాన్ని ప్రశంసించారు. అయితే సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్ ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోకి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఇంకా మాట్లాడుతూ.. `లిటిల్ హార్ట్స్ సినిమాపై నమ్మకం పెట్టుకుని, కోటి రెండు కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసిన వాసు, వంశీలను ఎంతగానో అభినందించాలి. అది మామూలు విషయం కాదు. మీరెంత కష్టపడినా అల్లు అరవింద్ గారి సినిమా అంటున్నారు. అది ఆయన లక్- మీ బ్యాడ్ లక్. ఆయన ఏం చెయ్యడు.. చివర్లో వచ్చి క్రెడిట్ కొట్టేస్తారు` అంటూ అల్లు అరవింద్‌పై బండ్ల గణేష్ నవ్వుతూనే సెటైర్స్ పేల్చారు.
అలాగే అల్లు అరవింద్ మహర్జాతకుడని.. స్టార్ కమెడియన్ కొడుకుగా, మెగాస్టార్ చిరంజీవి బావమరిదిగా, ఐకాన్ స్టార్ తండ్రిగా ఉండే గొప్ప అదృష్టం కోట్లలో ఒకరికి మాత్రమే దక్కుతుందని.. అది అల్లు అరవింద్ గారికి దక్కిందని బండ్ల గణేష్ అదే వేదికపై వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే బండ్లన్న కామెంట్స్ పై బన్నీ వాస్ రియాక్ట్ అయ్యారు. అల్లు అరవింద్‌గారు స్టార్ కమెడియన్ కు బిడ్డ కింద పుట్టలేదని, ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగయ్య స్టార్ కామెడియన్ అయ్యారని బన్నీ వాస్ నవ్వుతూనే బండ్ల గణేష్‌కు కౌంటర్ ఇచ్చారు. తనలాంటి వానిరి అరవింద్ గారు ఎంతో ఇన్స్పిరేషన్ అని, ఆయన తమకంటే ఎక్కువ కష్టపడతారని.. ఆయన లేకపోతే మేము లేమని బన్నీ వాస్ పేర్కొన్నారు.
మొత్తానికి అల్లు అరవింద్‌పై బండ్ల గణేష్ సెటైర్స్ వేయడం.. వాటికి బన్నీ వాస్ కౌంటర్ వేయడంతో నెట్టింట ఈ మ్యాటర్ చర్చలకు దారితీసింది. దీంతో బండ్ల గణేష్ `అల్లు అరవింద్ గారు మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత, ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్స్. ఆయన దూరదృష్టి, కృషి, సినిమా మీద ఉన్న ప్రేమ వలన తెలుగు సినిమా గర్వంగా నిలిచింది. అల్లు అరవింద్ గారు అంటే మాకు ఎంతో ఇష్టం` అంటూ పోస్ట్ పెట్టి సింపుల్‌గా పరిస్థితిని కూల్ చేసేశారు.