అపర కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్‌బెజోస్ కి అంతరిక్ష యానం అంటే మహా ఇష్టం. అందుకే ఆయన ‘బ్లూఆరిజన్’ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. తనతో పాటు సామాన్య ప్రజలను కూడా తక్కువ ధరలకే రోదసీలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ అంతరిక్ష సంస్థ ‘న్యూ షెపర్డ్’ రూపొందించి తొలి అంతరిక్ష యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసింది. ఈ సంస్థలో 3,500 మంది ప్రతిభావంతులు ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో మన భారతీయులు కూడా చాలామంది ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ సంస్థలో పని చేస్తున్న నితిన్ అరోరా అనే ఇంజనీర్ మన భారత మూలాలున్న వ్యక్తే. 2018 నుంచి అతను లీడ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తుండేవారు. 
అయితే తాజాగా బ్లూఆరిజన్ సంస్థ నుంచి బయటికి వచ్చేసానని అరోరా ప్రకటించారు. తాను బ్లూ ఆరిజిన్‌తో విడిపోయానని.. స్పేస్‌ఎక్స్‌లో చేరబోతున్నట్టు ఆగస్టు 16న లింక్డ్‌ఇన్‌లో ప్రకటించారు. స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యోమగాములను చంద్రునిపైకి తీసుకెళ్లడానికి
నాసా నుంచి 2.9 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని చేజిక్కించుకుంది. అయితే అరోరా ప్రత్యర్థి సంస్థ స్పేస్‌ఎక్స్ లో చేరడం బ్లూఆరిజన్ సంస్థకు కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు.
అరోరా చంద్రుని మీదకు తీసుకువెళ్లే ఒక వ్యోమనౌకను రూపొందించే ప్రాజెక్టులో లీడ్
ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఈ మూన్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై వివిధ పేలోడ్‌లను తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. బ్లూఆరిజన్ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ (HLS) నేషనల్ టీమ్‌లో మిషన్ ఆర్కిటెక్చర్, ఇంటిగ్రేషన్ లీడ్ అయిన నితిన్ అరోరా పని చేసేవారు. కానీ ఇప్పుడు అతను వైదొలగడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో ప్రతిభావంతుడి కోసం జెఫ్‌బెజోస్ సంస్థ అన్వేషణ సాగిస్తోందని తెలుస్తోంది.
నాసా సంస్థ అన్ని బిలియన్ డాలర్ల డీల్స్ లను స్పేస్ఎక్స్ సంస్థకే అప్ప చెబుతోంది. దీంతో బ్లూ ఆరిజిన్ సంస్థ న్యాయస్థానాలను ఆశ్రయించి కేసుల ఫైల్ చేస్తోంది. రెండు కంపెనీల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.