
ప్రస్తుతం ఈ నలుగురు జార్జియా రాష్ట్రంలోని సౌత్ ఫార్సైత్ హైస్కూల్ లో విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిల పేర్లు సుహాస్ బోంకుర్ వినయ్ పోలాకు కాగా అమ్మాయిల పేర్లు కృతిక కాసిరెడ్డి, రితిక వేములపల్లి. జార్జియన్ రాష్ట్రంలో ఉన్న యువతకు వీరు భారతీయ భాషలో నేర్పుతున్నారు. తెలుగు ఎలా అనర్గలంగా మాట్లాడాలో అచ్చులు, హల్లులు నుంచి చెబుతున్నారు. అమెరికాలో నివసిస్తున్న ఆసియన్లలో ఎక్కువమంది తెలుగు వారే ఉన్నారు. అందుకే తెలుగు భాషను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్న ఆలోచనతో ట్యూషన్ సేవలను ప్రారంభించారు.
సుహాస్‌కు మాతృభాషను ఇతరులకు నేర్పించడమంటే మహా ఇష్టం. అయితే తన లాంటి మనస్తత్వం ఉన్న మరో ముగ్గురితో కలిసి అతను ప్రస్తుతం 20 మందికిపైగా విద్యార్థులకు తెలుగు, తమిళం భాషలను నేర్పిస్తున్నారు. ఈ విద్యార్థులలో ఐదేళ్ల వయసు నుంచి 18 ఏళ్ల వయసున్న వారున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా తెలుగు నేర్పించాలి అనే ఉద్దేశంతో ‘టీటీ టాక్స్’ పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారు.
ఈ క్రమంలోనే సుహాస్ మాట్లాడాడు. తమ నలుగురిలో నాలుగు వేర్వేరు స్కిల్స్ ఉన్నాయని అన్నాడు. ఈ కారణంగానే తాము తమ ప్రయాణం సజావుగా కొనసాగిస్తామని తెలిపాడు. ఇక ఈ నలుగురిలో ఒకరైన కృతిక తెలుగు భాషలో మంచి పట్టు సాధించింది. ఈమె తెలుగు భాష నేర్పిస్తుండగా.. స్టడీ మెటీరియల్స్ సుహాస్ సమకూరుస్తున్నాడు.