ఎదుటి వాళ్ళకు చెప్పేటందుకే నీతులు ఉన్నాయి....అనేది తెలుగులో ఓ పాపులర్ పాటలో చరణం. అదిపుడు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ  ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, కేంద్రమంత్రిగా ఉన్నంత కాలం ఏపిలో చంద్రబాబునాయుడు పాల్పడిన ఫిరాయింపు రాజకీయాలపై ఏనాడూ పల్లెత్తు మాట మాట్లాడలేదు.

 

అదే ఉపరాష్ట్రపతిగా ఎంపికయ్యే ముందు, ఉపరాష్ట్రపతి అయిన తర్వాత మాత్రం ఫిరాయింపులపై చాలా నీతులే చెప్పారు. ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే మూడు నెలల్లో వాళ్ళ పదవులు పోయేట్లు చట్టం రావాలన్నారు. అసలు పార్టీ ఫిరాయించిన రోజే పదవి పోయేట్లుగా చట్టం రావాలని కూడా చెప్పేశారు. విచిత్రమేమిటంటే ఆ సూచనను ప్రధానమంత్రి నరేంద్రమోడికి మాత్రం చెప్పలేదు.

 

ఇపుడీ ప్రస్తావన ఎందుకంటే తాజాగా టిడిపిలో నుండి బిజెపిలోకి నలుగురు రాజ్యసభ సభ్యులు ఫిరాయించారు. గతంలో వెంకయ్యే చెప్పినట్లుగా ఇపుడు వాళ్ళ పదవులు పోవాలి కదా ? వాళ్ళపై వెంకయ్య ఫిరాయింపుల నిరోధక వేటు వేయాలి కదా ? ఫిరాయించిన వాళ్ళంతా రాజ్యసభ సభ్యులే కాబట్టి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో వెంకయ్యే వాళ్ళపై నేరుగా వేటు వేసేయొచ్చు.

 

మరి వెంకయ్య ఇపుడా పనిచేస్తారా ? ఎందుకంటే ఫిరాయించిన నలుగురు ఎంపిలు తమను బిజెపికి అనుబంధ సభ్యులుగా గుర్తించాలంటూ వెంకయ్యకే లెటర్ ఇచ్చారు. ఆ లేఖను బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డా సమక్షంలోనే వెంకయ్య అందుకున్నారు.  గతంలో తాను చెప్పిన నీతులను ఇపుడు వెంకయ్య పాటిస్తారా ? లేదా ? అన్న విషయాన్ని యావత్ దేశమంతా చూస్తోంది.

 

ఫిరాయింపు ఎంపిలపై తనిష్ట ప్రకారం చర్యలు తీసుకునేంత ధైర్యం వెంకయ్యకు లేదనే అనుకుంటున్నారు. వాళ్ళపై చర్యలు తీసుకోవాలని అనుకుంటే అందుకు నరేంద్రమోడి అనుమతి కావాలి. ఫిరాయింపులకు తెరవెనుక సూత్రదారి మోడి అందుకు వెంకయ్యకు అనుమతిస్తారా ? నిజంగానే వాళ్ళపై వెంకయ్య గనుక చర్యలు తీసుకుంటే టిడిపి, బిజెపిలు నష్టపోయి వైసిపి లాభపడుతుందనటంలో సందేహం లేదు. ఎవరికైనా ఎనీ డౌట్ ?


మరింత సమాచారం తెలుసుకోండి: