స్పీకర్ పదవి... ఈ పదవికి చాలా గౌరవం ఉంటుంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు ఈ పదవి అంటేనే భయపడిపోతారు. ఎందుకంటే స్పీకర్‌గా చేసిన వ్యక్తికి నెక్స్ట్ రాజకీయ భవిష్యత్‌కు చాలా డ్యామేజ్ జరుగుతుంది. అందుకే స్పీకర్ పదవి అంటే నాయకులు భయపడిపోతారు. గతంలో ఉమ్మడి ఏపీకి స్పీకర్‌గా పనిచేసిన నాయకులు రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్లుగా పని చేసిన కావలి ప్రతిభాభారతి, కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్‌లకు ఇప్పుడు సరైన రాజకీయ భవిష్యత్ కనిపించడం లేదు.

అటు తెలంగాణకు తొలి స్పీకర్‌గా పనిచేసిన మధుసూధనాచారి, ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యి, తెలంగాణ రాజకీయాల్లోనే పెద్దగా కనిపించడం లేదు. ఇక ఇటు ఏపీకి తొలి స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాద్ సైతం 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఊహించని విధంగా రాజకీయ పరమైన కారణాలతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం పనిచేస్తున్నారు.

సీతారాం సైతం స్పీకర్ సెంటిమెంట్‌ని బాగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. అందుకే త్వరగా ఈ స్పీకర్ పదవిని వదిలించుకుని మంత్రిగా సెట్ అవ్వాలని తమ్మినేని చూస్తున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే గతంలో తమ్మినేనికి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. టీడీపీలో ఉన్నప్పడు ఎన్టీఆర్, చంద్రబాబుల హాయంలో తమ్మినేని మంత్రిగా పనిచేయడంతో, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా మంత్రి పదవి కోసం ట్రై చేశారు.

కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా తమ్మినేనికి మంత్రి పదవి దక్కలేదు గానీ సభాపతి పీఠం దక్కింది. అయితే గతంలో స్పీకర్ సెంటిమెంట్‌ వల్ల చాలామంది నాయకులు నష్టపోయారు కాబట్టి, తమ్మినేని త్వరగా స్పీకర్ పదవిని వదిలేసి మంత్రిగా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారట. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కించుకోవాలని చూస్తున్నారట. మరి తమ్మినేనికి జగన్ తన క్యాబినెట్‌లో చోటు ఇస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: