ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోయింది.  అతి వేగం ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటుంది. కొంత మంది డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య తీవ్రం అవుతుంది.  తాజాగా ఏపీలో మద్యం మత్తులో మంత్రి  కారునే గుద్దేసిన ఘనుల ఉదంతం అందరినీ ఆశ్చర్యపరిచింది.  తాగి వాహనాలు నడపవొద్దని సోషల్ మీడియాలో ప్రతిరోజూ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఏకంగా మంత్రి  కారు..అందునా  ఎక్సైజ్‌ మంత్రి కారునే చిత్తుగా మద్యం సేవించి డాష్ ఇవ్వడం విశేషం. గురువారం రాత్రి దూబచర్లలో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రి జవహర్ సురక్షితంగా బయటపడ్డారు. ఎక్సైజ్ మంత్రి కారును ఢీకొట్టిన వ్యక్తులు మద్యం మత్తులో ఉండటాన్ని గమనించారు.

అనంతపురంలో జన్మభూమి సభ ముగించుకుని రోడ్డు మార్గంలో కొవ్వూరు వస్తుండగా నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. మంత్రి వాహనం స్వల్పంగా దెబ్బతింది. మంత్రి వాహనాన్ని ఢీకొట్టిన కారు కొవ్వూరుకు చెందిన ప్రసాద్ కు చెందిన‌దిగా గుర్తించారు. మంత్రి కారు ప్రమాదం సమాచారం తెలుసుకొని అక్కడకు చేరుకున్న పోలీసులు, ప్రమాదానికి కారణమైనవారిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: