
పరీక్ష పారదర్శకంగా నిర్వహించామని వైసీపీ నాయకులు చెపుతున్నారు. అదే నిజమైతే ఏళ్ల తరబడి అదే పనిగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అరకొర మార్కులొచ్చాయి, ఏపీపీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన అనితమ్మకు పరీక్షకు ప్రిపేరవకుండా ఫస్ట్ ర్యాంకు, అలాగే ఏపీపీఎస్సీలో ఉద్యోగం నిర్వర్తిస్తున్న మరో వ్యక్తి కుటుంబంలో ఇద్దరికి ర్యాంకులు ఎలా వచ్చాయో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పేపర్ లీక్ చేయటం వల్ల కష్టపడి పరీక్ష రాసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. లేకపోతే నిరుద్యోగుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.అయిదుగురు ఉపముఖ్యమంత్రులు కలిసి చంద్రబాబుకు రాసిన లేఖలోని భాష ఘోరంగా ఉంది.
సంప్రదాయాలను పక్కనపెట్టిన వైసీపీ నేతలు భాషను కూడా భ్రష్టు పట్టించారు. లేఖలో భాష సంగతి ఎలా ఉన్నా.. వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ల ఉద్యోగాలిచ్చామని మరోసారి వారే ఈ లేఖలో స్వయంగా ఒప్పుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజా సమస్యలపై పాటిస్తున్న మౌన వ్రతం పూర్తయ్యేదెప్పుడని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అనేక సమస్యలు.. ఇసుక కొరత, చిరుద్యోగుల సమస్యలు, రాజధాని మార్పు, వరదలు, బోటు ప్రమాదం వంటి దేనిపైన కూడా ఆయన స్పందించలేదు. కనీసం ఈ పేపర్ లీకేజీపై అయినా ముఖ్యమంత్రి నోరు తెరచి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి.