దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలకు నేడు రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. తెలంగాణకు సంబంధం లేని నిపుణులతో రీపోస్టుమార్టం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి సూచించిని విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో  హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో నిర్వహించనున్న ఈ పోస్టుమార్టానికి ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి సుధీర్ గుప్తా నేతృత్వం వహిస్తారు. ముగ్గురు వైద్యుల బృందం ఈ ఉదయం 9 గంటలకు పోస్టుమార్టం చేయనుంది. ఇక ఇప్పటికే ఎయిమ్స్ బృందం హైదరాబాద్ చేరుకుంది.

 

అలాగే ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీసి, కలెక్షన్స్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ను సీల్డ్‌ కవర్‌లో భద్రపరుస్తారు. రీపోస్టుమార్టం పూర్తయిన వెంట‌నే నలుగురు నిందితుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని హైకోర్టు చెప్పింది. సోమవారం ఉదయమే రీపోస్టుమార్టం ప్రక్రియ మొదలుకానుంది. ఇక ఒక్కో మృతదేహం పోస్టుమార్టానికి రెండు గంటల సమయంపట్టే అవకాశముంది. సాయంత్రంలోగా బాడీలను బంధువులకు అప్పగించడంతోపాటు సోమవారమే అంత్యక్రియలు జరిపించేలా ఆయా కుటుంబాలను పోలీసులు ఒప్పించినట్లు తెలుస్తోంది. కాగా, దిశ హత్యాచారం కేసు విచారణలో ఉండగానే డిసెంబర్ 6న చటాన్ పల్లి దగ్గర ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులు చనిపోయారు.

 

ఘటన జరిగి 16 రోజులు అవుతున్నా.. నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించలేదు, అంత్యక్రియలు జరగలేదు. ఎన్‌కౌంటర్ పై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ జరుగుతుండటంతో మృతదేహాల్ని భద్రపరిచాలని ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికే శవాలు 50శాతం కుళ్లిపోయాయని గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ శ్రావణ్ కోర్టుకి తెలిపారు. ఇలాగే కొనసాగితే మరో వారంలో పూర్తిగా కుళ్లిపోతాయని వెల్లడించారు. దీంతో వెంటనే రీపోస్టుమార్టం నిర్వహించి డెడ్ బాడీలను కుటుంబసభ్యులకు అప్పగించాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అలాగే దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన చెన్నకేశవులు భార్య రేణుకకు వైద్య సాయం అందించాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: