రాజధాని విశాఖకు తరలిపోవచ్చు..అంటూ అసెంబ్లీలో జగన్ సంకేతాలు ఇవ్వగానే అందరికంటే ముందు గగ్గోలు పెట్టింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎప్పుడైతే మాజీ సీఎం చంద్రబాబు అమరావతి నుంచి రాజధాని నుంచి తరలించడం అన్యాయం అంటూ మాట్లాడటం ప్రారంభించారో ఆనాటి నుంచే ఆయన అనుంగు పత్రికలు కూడా గుండెలు బాదుకోవడం ప్రారంభించాయి. అసలే పసలేని చంద్రబాబు ప్రెస్ మీట్ల నుంచి తమకు కావాల్సిన కోట్స్ వస్తే చాలు.. హెడ్డింగులు పెట్టి వార్తలు ప్రచురించాయి. ఇంకా ప్రచురిస్తూనే ఉన్నాయి. 

 

 

ఆయా పత్రికల్లో ఇటీవల వచ్చిన మచ్చుకు కొన్ని హెడ్డింగ్స్ చూడండి.. "వికాసం నుంచి విధ్వంసం వైపు", "ధ్వంసమవుతున్న  కల", " అడ్డపంచెల గుప్పిట్లో ", విశాఖ నెత్తిన నిప్పుల కుంపటి, అప్పుడు ముద్దులు ఇప్పుడు పిడిగుద్దులు, నాతోనే మైండ్ గేమ్ ఆడతారా”, ధర్మం తప్పిన రాజు.. ఇలా వారి క్రియేటివిటీకీ అంతూ పొంతూ లేదు.. ఇవన్నీ సినిమా టైటిల్ కాదండీ. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పై విషం చిమ్ముతూ పెడుతున్న మీడియా శీర్షికలు. 

 

 

చంద్రబాబు అభివృద్ధి పథగామికుడు అని.. జగన్ విధ్వంస పాలకుడు అన్నరీతిలో ఈ కథనాలు సాగుతున్నాయి. అంతేనా.. అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలను  రోజూ హైలెట్ చేస్తూ మిగిలిన రాష్ట్రాన్ని పట్టించుకోవడం మానేశాయి. ఒకవైపే చూడు.. మరోవైపు చూడకు.. తట్టుకోలేవ్ అంటూ ఓ సినిమా నటుడు కమ్ ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ను ఫాలో అయిపోతూ.. ఆ 29 గ్రామాలవైపే చూస్తున్నాయి. అంతే కాదు.. అకడక్కడా తెలుగుదేశం పార్టీ మిగిలిన రాష్ట్రంలో చేస్తున్న ఆందోళనలను ఒకటి, రెండు ఫోటోలు వేసి అట్టుడుకుతున్న రాష్ట్రం అంటూ దాన్ని బూతద్దంలో చూపే ప్రయత్నం బహుబాగుగా చేస్తున్నాయి. 

 

 

ఇలా చంద్రబాబు బాకా పత్రికలు రాసే రాతలు ఇటీవల పరమ రోతగా తయారయ్యాయి. విశాఖవాసులు తమకు రాజధాని వద్దు బాబో అంటున్నాయట. అంతేనా.. ఇప్పుడు ప్రశాంతంగా బతుకుతున్నాం.. ఈ రాజధాని వస్తే మా బతుకుల్లో ప్రశాంతత ఉండదు.. కడప రౌడీలు రాజ్యం చేస్తారని ముందుగానే భయపడిపోతున్నారట..  ఆ విషయం ఎక్కడా చెప్పకుండా జాగ్రత్తగా వచ్చి చంద్రబాబు బాకా పత్రికాగ్రేసరల చెవుల్లోనే చెబుతున్నారట.

 

 

ఓ ఆరు గ్రామాలు మినహాయించి మిగతా రాజధాని ప్రాంతంలో వ్యవసాయం గుదిబండగా మారడంతో బిక్కు బిక్కు మంటూన్న రాజధాని ప్రాంత రైతులకు రాజధాని ప్రకటన వెలువడగానే భవిష్యత్తు బాగుంటుందనే ఆశ కలిగిందట. చంద్రబాబుతో పాటు నాయకులకు, అధికారులకు మేళతాళాలతో స్వాగతం పలికి మరీ రాజధానికి భూములు అప్పగించారట. ఇవీ బాకా పత్రికల రాతలు. మరి అదే నిజమైతే.. నాలుగేళ్ల క్రితం బోయపాటి సుధారాణి తన భూములు ఇవ్వడానికి ఇష్టం లేక చంద్రబాబు, పుల్లారావు,నారాయణలను ఓ రేంజిలో తిట్టిపోస్తున్న  వీడియోలు ఇంకా యూట్యూబులోనే చక్కర్లు కొడుతున్నాయిగా.. అబ్బే అవి మనకు కనిపించవు. 

 

 

అంతేనా.. బాకా పత్రికలకు కనిపించాల్సినవి కనిపించవు. చంద్రబాబుకు జాకీలేసి లేపే సమయంలోమాత్రం  లేనివి కూడా కనిపిస్తాయి. ఇప్పటికే మూడు వేల కిలోమీటర్లు పైగా రహదార్లు, అనేక భవనాలు రాజధాని ప్రాంతంలో నిర్మించేశారని సదరు బాకా పత్రికలు రాసుకొస్తున్నాయి. మరి అదే నిజమైతే.. మూడు వేల కిలోమీటర్ల  రహదారులు అనేక భవనాలు పూర్తి చేసుకున్నది నిజం అయితే అక్కడ నుంచి రాజధానిని తరలించే సాహసం కొత్త ప్రభుత్వం చేయగలదా !? మరో అబద్దం ఏంటంటే.. రెండు వేల ఎకరాల పరిధిలో మాత్రమే చేపట్టిన మొదటి దశ నిర్మాణం కోసం 3000 కిలోమీటర్ల దూరం రోడ్లు వేశారట. అది సాధ్యమేనా.. సాధ్యాసాధ్యాలతో బాకా పత్రికలకు పని లేదు. ప్రజలకు మెదడు ఉందన్న విషయం వారికి అస్సలు స్ఫురించదు. మేమింతే.. ఒకవైపే చూస్తాం.. అదే రాస్తాం.. అన్నధోరణి ఆ పచ్చ పత్రికలది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: