ఉత్తరాంధ్ర.. తెలుగు నేలలో ఎక్కువగా వెనుకబడిన ప్రాంతం ఇదే. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో ఆ నాలుగు జిల్లాలే ఎక్కువగా అభివృద్ధి చెందాయని.. వాటి పెత్తనమే ఎక్కువగా ఉంటుందని ఓ టాక్ ఉంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర మొదటి నుంచి వెనుకబడే ఉన్నాయి. రాయలసీమ వెనుకబాటుకు నీళ్లులేకపోవడం, భూముల తీరు కారణమైతే.. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండటం కారణంగా చెప్పుకొవచ్చు.

 

అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పొరుగు రాష్ట్రాలకూ ఉత్తరాంధ్ర కూలీలు వలస వెళ్లే దుస్థితి ఉంది. ఇప్పుడు.. ఇప్పటికే.. అభివృద్ధి చెందిన‌ విశాఖ‌లో రాజ‌ధాని ఏర్పాటుతో చుట్టుప‌క్కల ఉన్న జిల్లాల‌కు పెట్టుబ‌డులు పెరుగుతాయి. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.

 

ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు.. ఇందులో విశాఖ పట్నం జిల్లాలోని పట్టణ ప్రాంతం బాగానే అభివృద్ధి చెందింది. విశాఖను ఆనుకుని ఉన్న విజయనగరానికి ఆ తర్వాత శ్రీకాకుళానికి ఇప్పుడు మంచి రోజులు వచ్చినట్టే చెప్పుకోవాలి. విశాక కేంద్రంగా ఈ ప్రాంతాలు త్వరగా అభివృద్ధి చెందే వీలు ఉంది.

 

ఇక ఇప్పటికే మహానగరంగా విలసిల్లుతున్న విశాఖ పట్నం అభివృద్ధి మరింత జోరందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విశాఖ రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలోనే పెద్ద నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. నౌకాశ్రయం, నౌకాదళం ఏర్పాటు కారణంగా ఇక్కడ మెట్రోపాలిటన్ కల్చర్ బాగా అభివృద్ధి చెందింది. ఇక ఇప్పుడు వీటికి రాజధాని కళ కూడా తోడవటంతో విశాఖ కు జాతీయ స్థాయి గుర్తింపు దక్కనుంది.

 

విశాఖ పర్యాటకంగా బాగా అభివృద్ధికి అవకాశం ఉన్న నగరం. ఇప్పుడు రాజధాని రావడంతో మరింత అభివృద్ధికి మార్గం దక్కింది. విశాఖ చుట్టుపక్కల విస్తృతంగా భూములు కూడా అందుబాటులో ఉన్నాయి. రాజధాని హోదా, సాగర తీరం, బౌద్ధ ప్రాజెక్టులు, ప్రశాంత వాతావరణం ఇలా వెరసి.. విశాఖ సర్వతోముఖాభివృద్ధికి ఆస్కారం ఏర్పడే అవకాశం లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: