ప్రపంచం ఓవైపు అభివృద్ధి పధంలో దూసుకుపోతుంటే.. ఈ 2020 లో కూడా సమాజాన్ని కొన్ని మూఢనమ్మకాలు, మత్రం.. తంత్రం పట్టి పీడిస్తున్నాయి అనడంలో అతిశయోక్తిలేదు. ఎక్కడో ఓ చోట చేతబడి, క్షుద్రపూజలు, నరబలులు, జంతుబలులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పిల్లలు ఆడుకునే క్రికెట్ మైదానంలో భయానకంగా మారిన వాతావరణం కనిపించింది. గ్రౌండ్‌లో పెద్ద బొమ్మ గీసి అందులో నల్ల కోడిని బలి ఇచ్చి పూజలు చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. 

 

దీంతో ఉదయాన్నే క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్‌కు వచ్చిన కొందరు అవి చూసి భయపడిపోయారు. ఆందోళన చెంది వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించారు. అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్షుద్ర పూజలు వ్యవహారంలో గ్రామస్థులు ఎవరైనా పాత్ర ఉందా లేదా ? బయటవారే ఈ పనులకు పాల్పడ్డారా ? అన్న కోణంలో విచారణ చేపట్టారు. మరోవైపు స్థానికులు మాత్రం ఎవరిపైన అయిన బాణామతి ప్రయోగం చేశారేమోనని భయాందోళలు వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరగడం మనం గమనించవచ్చు. గతవారంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బలులో ఓ చేతబడి కలకలం రేపింది. ఓ మహిళ చేతబడి చేస్తూ జామాయిల్‌ తోటలో దున్నపోతును బలిఇచ్చినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఒక బాలుడి బొమ్మని చిత్రీకరించి దాని ముందు గొయ్యి తవ్వి నిమ్మకాయలు, కుంకుమ, పసుపుతో క్షుద్రపూజలు చేశారు. 

 

దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు మూడు.. నాలుగు రోజులు నిద్రాహారాలు లేకుండా గడిపారు. క్షుద్రపూజలు చేసినట్లు భావిస్తున్న మహిళకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. తోటలోకి తీసుకెళ్లి సామాగ్రి అంతా కాల్చి తగులబెట్టారు. దున్నపోతు తల నరికి గొయ్యి తీసి, క్షుద్రపూజు చేసిన సామాగ్రిని గోతిలో పాతిపెట్టిన విషయాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. కాలం మారుతున్నా, ఇలాంటి అవనీయమైన సంఘటనలు జరగడం దురదృష్టకరం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: