దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 498కు చేరింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 606 జిల్లాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల పేర్లతో ప్రజలు గుంపులుగా రోడ్లపైకి వస్తూ ఉండటం పోలీసులను టెన్షన్ పెడుతోంది. 
 
ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా కొన్ని ప్రాంతాల్లోని ప్రజల్లో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు పూర్తి స్థాయిలో 144 సెక్షన్ విధించి ప్రజలను ఇళ్ల నుండి బయటకు రాకుండా కట్టడి చేస్తున్నాయి. జైల్లో కూడా కరోనా సోకే అవకాశం ఉండటంతో 3000 మంది ఖైదీలను విడుదల చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధ్యంతర బెయిల్ పై వీరిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
కరోనాను కట్టడి చేసేందుకు ఢిల్లీలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఢిల్లీలోని షహీన్ భాగ్ లో కర్ఫ్యూ విధించారు. పోలీసులు ప్రజలు ఎవరూ బయటకు రాకుండా నియంత్రిస్తున్నారు. పోలీసులు ఢిల్లీలో కొద్దిరోజుల నుంచి ఆందోళన చేస్తున్న వారిని అక్కడినుండి పంపించివేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని సమాచారం. 
 
పోలీసులు అత్యవసర సేవలకు మాత్రమే ప్రజలను అనుమతిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలను పాటించని వాళ్లపై పోలీసులు కేసులు పెడుతున్నారు. తెలంగాణలో నిన్నటివరకు 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సీఎంలు అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: