ఎలాంటి విమర్శలకైనా లాజికల్ గా కౌంటర్లు ఇచ్చి, ప్రత్యర్థుల నోరుమూయించడం ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఓ పాయింట్ పై మాట్లాడారు అంటే, ఇంకా నెక్స్ట్ దాని గురించి చెప్పుకోవడానికి ఏముండదు. అయితే విపక్షాల నోరు మూయించే బుగ్గన, ఈ మధ్య కాస్త మీడియా ముందుకు రావడంలేదు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులని సరిచేసేందుకు బుగ్గన కష్టపడుతున్నారు.

 

దీంతో కరోనాని రాజకీయంగా వాడుకుంటూ జగన్ ప్రభుత్వంపై బురద జల్లుతున్న టీడీపీకి బుగ్గన కౌంటర్లు ఇవ్వడం కుదరడం లేదు. అయితే టీడీపీ విమర్శలు మితిమీరిపోవడంతో ఆయన సడన్ గా మీడియా ముందుకొచ్చి, టీడీపీ చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. కరోనాతో సహజీవనం తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చెప్పిందని, కాబట్టి కరోనా గురించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలు అక్షరసత్యమని మాట్లాడారు.

 

అలాగే దేశంలో కరోనా టెస్టులు ఎక్కువ చేసేది ఏపీనేనని, ఎక్కువ టెస్టులు చేస్తున్నారు కాబట్టే, ఎక్కువ కేసులు వస్తున్నాయని, ఇక ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన పరోక్షంగా తెలంగాణని మధ్యలోకి లాగారు. గత కొన్ని రోజుల నుంచి ఏపీలో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతుండగా, తెలంగాణాలో తక్కువ నమోదవుతున్నాయి. దీంతో జగన్ ప్రభుత్వం కరోనా కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

 

అందుకే బుగ్గన వచ్చి లాజికల్ గా పరిస్థితి ఏంటో చెప్పారు. అయినా సరే టీడీపీ నేతలకు ఆ విషయం అర్ధం కావడం లేదు. జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో, ఇంకా విమర్శలు చేస్తున్నారు.  కరోనాపై వైసీపీ నేతలకు ఎందుకు అంత ప్రేమ..? అని, కరోనా వైరస్‌ను పారద్రోలేందుకు ప్రపంచమంతా శ్రమిస్తోందని, ఏపీ సీఎం, మంత్రులు కరోనాతో సహజీవనం అంటూ మాట్లాడటం సిగ్గుచేటని మాట్లాడుతున్నారు. మొత్తానికైతే ప్రభుత్వంపై ఎంత క్లారిటీ ఇచ్చిన అది టీడీపీకి మాత్రం అర్ధం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: