చంద్రబాబునాయుడు. సీనియర్ మోస్ట్ లీడర్. దేశంలోనే తనంతటి సీనియర్ లేడని చెప్పుకున్న నేత. ప్రజాస్వామ్యం పుణ్యమాని మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. మరి అంతటి బాబు నోటి వెంట ఎలాంటి మాటలు వస్తున్నాయో చూశారా. జగన్ కి ఒక్క చాన్సేనట. అది కూడా చివరి చాన్సేనట. ఆయన దిగిపోవాల్సిందేనని గద్దిస్తున్నారు. నిజానికి జగన్ కి చాన్స్ ఇచ్చింది ఎవరు, అసలు బాబుకైనా ఎవరు ఛాన్స్  ఇస్తున్నారు.  ఏపీ జనం,  వారే ప్రజాస్వామ్యంలో అసలైన  ప్రభువులు. మరి వారు అధికారం ఇస్తే ఎవరైనా అయిదేళ్ల పాటు సీఎం సీట్లో కూర్చుంటారు.

ఆ అయిదేళ్ళు వారి పాలన తీరులో తప్పులు ఉంటే కచ్చితంగా విపక్షంగా బాబు నోరు చేసుకోవాల్సిందే. కానీ ప్రతీ రోజూ పనిగట్టుకుని విమర్శిస్తూంటే తమ్ముళ్లకే అది ఎక్కడంలేదుగా. తెల్లరిలేస్తే జగన్ జగన్ అంటూ బాబు కలవరింతలు చూసిన తమ్ముళ్ళు తలలు పట్టుకున్నారు. 23 సీట్లకు దిగజారిపోయిన పార్టీని గాడిన పెట్టుకునే సువర్ణ అవకాశాన్ని జనం ఇచ్చారు. ఒక విధంగా బాబు ఆలోచించుకోవడానికి, తిరిగి పుంజుకోవడానికి ఇది మంచి తరుణం. కానీ బాబు మాత్రం ఆ వూసు మరచినట్లున్నారు.

ఆయన ఎక్కడో ఉండిపోయారు. ఇంకా జనం తనను ఎందుకు ఓడించారు. సీఎం సీటు తమకే శాశ్వతం కదా అని భ్రమ‌ల్లో ఉన్నారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తాను ఖాళీ చేసిన సీట్లో జగన్ కూర్చోవడం కూడా బాబు అసలు తట్టుకోలేకపోతున్నారు. జగన్ బీసీలను లాగేస్తున్నారు. వారి కోసం ప్రత్యేక కార్పోరేషన్లను ఏర్పాటు చేశారు. దాంతో ఆయన పాతుకుపోతున్నాడు అన్న కంగారు కూడా పట్టుకున్నట్లుగా ఉంది.

దాంతో ఆయన‌ ప్రతీ రోజూ జగన్ని హెచ్చరిస్తున్నారు. నీ పదవీ కాలం ఈ ఒక్కసారే సుమా. చివరి చాన్స్ నీకు ఇచ్చారు జనం. ఆనక నా జమానాయే సుమా అంటూ వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు. మరి ఈ రకమైన పాలిటిక్స్ చేస్తే ఏపీలో టీడీపీ ఎత్తిగిల్లుతుందా. బాబే ఆలోచించుకోవాలి. నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తేనే జనం మద్దతు లభిస్తుంది. లేకపోతే అసహనం, అక్కసు మాత్రమే బయటపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: