ఇక వారికి తగ్గకుండా వైసీపీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే రోజా, మంత్రి అనిల్‌లు అయితే టీడీపీ ఇక మూసేసుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు పని అయిపోయిందని... హైదరాబాదులో విశ్రాంతి తీసుకోవచ్చని మంత్రి అనిల్ కుమార్ హితవు పలికారు. చంద్రబాబు ఇక మీదట పార్టీని మూసివేయాలని, రోజా వ్యాఖ్యానించారు. అయితే వైసీపీ నేతలు మాట్లాడినట్లుగా టీడీపీని మూసేయాల్సిన పరిస్థితి ఉందా? అంటే అసలు లేదనే చెప్పొచ్చు.
2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయినా సరే మంచి ఓటింగ్ శాతం తెచ్చుకుంది. వైసీపీకి 50 శాతం వరకు వస్తే, టీడీపీకి 40 శాతం వరకు వచ్చింది. అంటే ఈ ఓట్ల శాతం ఏమి తక్కువేమీ కాదు. పైగా తాజాగా ఓ సర్వేలో కూడా వైసీపీ-టీడీపీలకు ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం తగ్గలేదని తెలుస్తోంది. దీని బట్టి చూస్తే వైసీపీ ఆధిక్యంలోనే ఉన్నా, టీడీపీకి కూడా బాగానే ఓట్లు ఉన్నాయి.
ఇప్పటికిప్పుడు వైసీపీకి టీడీపీ కాకుండా వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పొచ్చు. పైగా నెక్స్ట్ ఎన్నికలకు మూడున్నర ఏళ్ల వరకు సమయం ఉంది. ఈ గ్యాప్‌లో ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే టీడీపీకి ఓట్ల శాతం ఏమి తగ్గలేదు. రెండు పార్టీల మధ్య పది శాతం వరకు తేడా ఉంది. ఇది రాబోయే కాలంలో తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో టీడీపీ మూసేయడం సాధ్యమయ్యే పని కాదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి