హైదరాబాద్/అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనాలకు తెర లేపుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని భూముల విషయంలో తెలుగు దేశం పార్టీ హయాంలో చాలా నేరాలూ, ఘోరాలూ జరిగాయని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ.. సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొంత మంది.. రాజధానిలో భూములు ముందుగానే కొనుగోలు చేశారని, అంటే ఇక్కడ ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు సీఐడీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలువురిపై కేసులు నమోదు చేశారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

అయితే ఈ కేసులో భూములు అమ్మిన వారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని పేర్కొంటూ కిలారు రాజేష్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని, ఇది చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రెండు పార్టీల వాదనలు విన్న న్యాయస్థానం.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. ఈ కేసు ఐపీసీ సెక్షన్లకు వర్తించదని హైకోర్టు స్పష్టంగా చెప్పేసింది.

ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై తీర్పులో హైకోర్టు ఏం చెప్పింది?. ఎగిరెగిరి పడ్డ జగన్ సర్కార్‌కు తల బొప్పి కట్టిందా?. ఫిర్యాదు లేకుండా కేసులు పెట్టడం ఏంటనే కోర్టు ప్రశ్నతో అయినా జ్ఞానోదయం అయ్యిందా?
అని టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాజధాని విషయంలో అవినీతి జరిగిందని, అందువల్లే రాజధానిని తరలిస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు ఏం చేస్తారని విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: