న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగించడం మన దేశంలో దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించనుంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో రాష్ట్రప్రతి ప్రసంగానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవిండ్ రేపు ఉదయం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. అదేంటంటే పార్లమెంట్ ప్రారంభంలో నిర్వహించే రాష్ట్రపతి ప్రసంగ కార్యక్రమానికి గౌర్హాజరవ్వాలని నిర్ణయించుకున్నాయి. దాదాపు 16 ప్రతిపక్షాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి.

కొత్త సాగు చట్టాలను ప్రతిపక్షాలు లేకుండా ఆమోదించారని, వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ బిల్లులకు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో ఆయనపై కూడా సదరు పార్టీలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ పార్టీలన్నీ కలిసి గురువారం ఓ ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.

దీనిపై కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం చేసే ప్రసంగాన్ని బహిష్కరించేందుకు గానూ తమతో పాటు మరో 15 పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, ఎన్‌సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, డీఎంకే, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ముస్లింలీగ్, ఆర్ఎస్‌పీ, పీడీపీ, ఎండీఎంకే, ఏఐయూడీఎఫ్, కేరళ కాంగ్రెస్(ఎం) పార్టీలన్నీ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయన్నారు.

ఇదిలా ఉంటే గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు 20 మంది రైతు సంఘాల నేతలకు ఈ రోజు నోటీసులు జారీ చేశారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటలకు సంబంధించి నమోదు చేసిన కేసుల్లో భాగంగా ఈ నోటీసులను పంపించినట్లు తెలిపారు. 3 రోజుల్లోగా సమాధానాలు సమర్పించాలని ఆ రైతు నేతలకు ఆదేశాలు పంపారు.

మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో గాయపడి, చికిత్స పొందుతున్న పోలీసు సిబ్బందిని పరామర్శించి భరోసా ఇచ్చారు. రైతు ఘర్షణల్లో దాదాపు 400 మంది పోలీసులు గాయపడ్డారు. వారిలో అనేకమంది సివిల్ లైన్స్‌లోని సుశ్రుత ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: