పార్టీలు ఏవైనా.. రాజకీయ నాయకులు ఎవరైనా.. అధికారంలో ఉన్నప్పడు చెప్పేదొకటి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేదొకటి.. ఇది ఓ లోకరీతిగా మారింది. అధికారంలో ఉన్నవారి అండతో వారి అనుచరులు రెచ్చిపోతుంటారు. అధికారంలో ఉన్నవారి పేరు చెప్పి అరాచకాలు చేస్తుంటారు. అధికారంలో ఉన్నవారు కూడా పోనీలే అన్నట్టుగా వదిలేస్తుంటారు. పోనీ.. మరీ ప్రతిపక్షాలు అల్లరి చేస్తే.. ఓ కమిటీ వేశామనో.. విచారణ జరిపిస్తున్నామనో కబుర్లు చెప్పడం చాలా సర్వసాధారణంగా మారింది.

కానీ.. ఏపీ సీఎం జగన్ మాత్రం ఇటీవల సొంత జిల్లాలో సొంత బంధువుపై చర్య తీసుకోవడం ద్వారా మంచి నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లాలో కొద్ది రోజుల క్రితం మామిళ్లపల్లె ముగ్గురాళ్ల గనుల వద్ద పేలుడు ఘటనలో పది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన రోజే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దోషులు ఎవరైనా తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అసలు ఆ గనులు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పెదనాన్న అయిన వైఎస్ ప్రతాపరెడ్డివని తేలింది.

ఎంపీ పెదనాన్న అంటే.. జగన్ కూ బంధువే.. అయినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడలేదు. పది మంది వరకూ మరణానికి కారణమైన వైఎస్ ప్రతాప రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ పేలుడు పదార్థాలు వైఎస్‌ ప్రతాపరెడ్డి సంస్థల నుంచి రవాణా చేసినట్లు కడప ఎస్సీ, ఎస్టీ విభాగం డీఎస్పీ సుధాకర్‌ తెలిపారు. వైఎస్‌ ప్రతాప రెడ్డి... ఎక్స్‌ప్లోజివ్‌ రూల్స్‌కు విరుద్ధంగా లైసెన్సు లేని వారికి పేలుడు పదార్థాలు విక్రయించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు.

మొత్తానికి ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న ప్రతాపరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్య ద్వారా దోషులు తమ బంధువులైనా వదిలేది లేదని సీఎం జగన్ పరోక్షంగా చెప్పినట్టయింది. అయితే కేవలం అరెస్టుతో సరిపుచ్చకుండా విచారణ సకాలంలో పూర్తయ్యేలా చూసి.. నేరానికి తగిన శిక్ష పడినప్పుడే మృతుల కుటుంబాలకు న్యాయం జరిగినట్టు భావించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: