తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్యాధికారులు మాట్లాడుతూ కరోనా రోగులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే డీఎంఈ రమేష్
రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కరోనా రోగికి బ్లాక్ ఫంగస్ రాదని వెల్లడించారు. ఈ ఇన్ఫెక్షన్ కొందరికి మాత్రమే వస్తుందని, బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కి ఇచ్చే మందులు తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పటికే ముగ్గురు రోగులు బ్లాక్ ఫంగస్ తో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి
గాంధీ ఆసుపత్రిలో చేరారని వైద్య అధికారులు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తులందరినీ ప్రైవేట్ వైద్యులు
గాంధీ ఆస్పత్రికి తరలించడం సరికాదని ఈ సందర్భంగా వైద్యాధికారులు చెప్పుకొచ్చారు.
హైడోస్ స్టెరాయిడ్స్ వినియోగించే వారిలో ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని.. మిగతావారు భయాందోళనలకు గురికావలసిన అవసరం లేదని డీఎంఈ రమేష్
రెడ్డి తెలిపారు. కొందరికి మాత్రమే బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని.. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
ఇకపోతే కరోనా సెకండ్ వేవ్ బీభత్సంగా విజృంభిస్తుండగా భారత దేశంలో పరిస్థితులు రోజురోజుకీ మరింత దయనీయంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది కరోనా బాధితులను బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ పట్టిపీడిస్తోంది.
మహారాష్ట్ర,
గుజరాత్,
ఢిల్లీ,
కర్నాటక,
తెలంగాణ రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవుతుండగా.. ఇప్పటికే ఈ ఇన్ఫెక్షన్ తో నిర్మల్
జిల్లా భైంసాలోని గణేష్‌నగర్‌కు చెందిన
తోట లింగురామ్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు.
మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కేసులు 2 వేలకు పైగా నమోదయ్యాయని సమాచారం.
మహారాష్ట్ర పక్కనే నిర్మల్
జిల్లా ఉండటంతో ఆ
జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరాడకపోవడం, రక్తపు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కరోనా రోగులందరికీ బ్లాక్ ఫంగస్ రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.