ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి.. ఇది చాలా పురాతన డిమాండ్.. తెలుగు దేశం ఎప్పటి నుంచో అడుగుతున్న డిమాండ్.. తెలుగు దేశమే కాదు.. ఎన్టీఆర్ అభిమానులంతా ముక్త కంఠంతో కోరుకునే డిమాండ్. ఆ మాటకొస్తే ప్రతి తెలుగువాడి డిమాండ్ కూడా. భారత్ రత్న వచ్చిన వారిలో ఎన్టీఆర్ కంటే స్థాయి తక్కువ వారు చాలా మంది ఉన్నారు కూడా. అలాంటిది.. తెలుగు గడ్డపై చలన చిత్ర, రాజకీయ రంగాల్లో మేరునగధీరుడిగా పేరున్న ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాల్సిందే.

ఇప్పుడు ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా గళం కలిపారు. ఇవాళ ఎన్టీఆర్ 99 వ జయంతి సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్‌ సేవలను స్మరించుకున్నారు. ఆయన నూరో  జయంతి దగ్గరపడుతున్న వేళ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గతంలో భూపేన్ హజారికాకు మరణానంతరం ఇచ్చినట్టు ఎన్టీఆర్‌ కు కూడా మరణానంతరం భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

అయితే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ.. ఆ దిశగా గట్టి ప్రయత్నాలు జరగలేదన్నది వాస్తవం. గతంలో చంద్రబాబు కేంద్రంలో ప్రధానులను నిర్ణయించే రేంజ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఈ దిశగా ప్రయత్నించలేదు. అప్పుడే చంద్రబాబు తలచుకుని ఉంటే ఎన్టీఆర్‌కు భారత రత్న వచ్చి ఉండేదని విశ్లేషకులు చెబుతుంటారు. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ ప్రభ బాగా తగ్గిపోయింది.

ఒకనాడు పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగు దేశం నేడు ఉప ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఆ పార్టీ డిమాండ్‌లను పట్టించుకునేవారు ఎవరుంటారు.. అంతే కాదు.. ఈ డిమాండ్‌లో పెద్దగా చిత్తుశుద్ధి కూడా కనిపించదు. ఏదో ఎన్టీఆర్ జయంతి, వర్థంతి రోజు తప్ప ఈ డిమాండ్ గురించి సీరియస్ గా పట్టించుకునేవారే కనిపించరు. అలాంటప్పుడు ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించే దమ్మున్న వారేరీ.. ఎన్టీఆర్‌పై ఎనలేని ప్రేమ కురిపించే ఉప రాష్ట్రపతి వెంకయ్య ఏమైనా ప్రయత్నిస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: