నరేంద్రమోదీ కేబినెట్ విస్తరణ 36మంది కొత్త నాయకుల్లో ఉత్సాహాన్ని నింపింది, సహాయ మంత్రుల స్థాయినుంచి కేబినెట్ ర్యాంకుకి ప్రమోట్ అయిన ఏడుగురికి సంతోషాన్నిచ్చింది. అయితే ఉద్వాసనకు గురైన 12మంది మాత్రం షాక్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వారిలో థావర్ చంద్ గహ్లాత్ కి మాత్రం గవర్నర్ పదవి ఇచ్చి ఆయనకు ఘనంగానే వీడ్కోలు పలికారు మోదీ. మిగిలిన 11మంది ప్రధానిపై రగిలిపోతున్నారు.

ఉద్వాసనకు గురైన ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రమాణ స్వీకారోత్సవ సంబరానికి దూరంగా ఉన్నారు. కనీసం కొత్తవారికి శుభాకాంక్షలు కూడా తెలపలేదు. ఈ ముగ్గురు సీనియర్లతోపాటు, పోర్ట్ ఫోలియోలు కోల్పోయిన మిగతా నేతలు కూడా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ చేసిన పలు వ్యాఖ్యలు ఆయనపై వేటుకు కారణం అయ్యాయి. ఆక్సిజన్ లభ్యత, టీకాల అందుబాటులో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే అపవాదు ఉంది. ఆరోగ్య శాఖ పనితీరు కారణంగానే కేంద్రంపై ఈ నిందపడిందని భావించిన ప్రధాని నరేంద్రమోదీ, ఆయనను కేబినెట్ నుంచి తొలగించారని సమాచారం. ట్విట్టర్ వివాదం వల్ల ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పదవి కోల్పోయారని అంటున్నారు. సోషల్ మీడియాని భారత ప్రభుత్వం నియంత్రిస్తోంది అనే అపవాదు కేంద్రంపై రావడానికి రవిశంకర్ విధానాలే కారణం అని అంటున్నారు. అంతర్జాతీయ సమాజం భారత్ పై వేలెత్తి చూపించే అవకాశం కలగడానికి కారణం అయానేనని మోదీ అభిప్రాయం. అందుకే ఆయన కుర్చీకిందకు నీళ్లొచ్చాయి.




మిగతావారి విషయంలో కూడా వివిధ కారణాలున్నా.. కరోనా కష్టకాలంలో తమ పరిధిలో తాము పనిచేశామని, అయినా కూడా మోదీని సంతృప్తి పరచలేకపోయామని వాపోయారు.

ఇక మోదీ కేబినెట్ బెర్త్ ల కేటాయింపుపై న్యాయపోరాటానికి దిగుతామంటున్నారు లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్. ఇటీవలే ఆయనను ఎల్జేపీ లోక్ సభాపక్ష నేతగా తొలగించి, ఆయన బాబాయ్ పశుపతి కుమార్ పరాశ్ ఆ స్థానంలో కూర్చున్నారు. ఇప్పుడు పశుపతి కుమార్ కు మోదీ మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఎల్జేపీనుంచి ఆయనను బహిష్కరించామని, అలాంటి వారికి మంత్రి పదవి ఇవ్వడం సరికాదని, ఎల్జేపీ కోటాలో పశుపతి కుమార్ కి మంత్రి పదవి ఇస్తే కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించారు చిరాగ్ పాశ్వాన్. మొత్తమ్మీద మోదీ మంత్రివర్గ విస్తరణ బీజేపీకి కొంచెం ఇష్టం - కొంచెం కష్టంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: