వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండున్నర ఏళ్ల కాలంలో జరిగిన పరిణామాలను నిశితంగా గమనిస్తే.. పల్నాడు రాజకీయం రంగు మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దౌర్జన్యాలు, దాడులు, హత్యలు మాత్రమే కనిపించిన ప్రాంతంలో.. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత నయా ట్రెండ్‌ పురుడు పోసుకుందన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు, అరాచకాలు, అరెస్టులు వంటి వాటిని గమనిస్తే.. పల్నాడు రాజకీయం మారిందనే చర్చ జరుగుతోంది. ఒకరకంగా రాయలసీమలో తరుచూ కనిపించే రాజకీయాలకు చేరువగా పల్నాడు రాజకీయాలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక చోటుచేసుకున్న ఘటనలే అలాంటి వాదనలకు బలాన్ని ఇస్తున్నాయి.

గుంటూరు జిల్లా వాసుల మనసుల్లో పల్నాటి పులిగా స్థానం సంపాదించుకున్న మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును వైసీపీ సర్కారు వేధింపులే బలి తీసుకున్నాయన్న ఆవేదన.. ఆయన అనుచరులు, అభిమానుల్లో ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉంది. ఆయన్ను ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఇటీవల ఆయన వర్ధంతి సభలోనూ మండిపడ్డారు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఘటన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులు జరిగాయి. ఇందుకు నిరసనగా వైసీపీ బాధితుల పేరుతో వారు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. అప్పుడు ఛలో ఆత్మకూరు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుంటూరు సిటీలోనే వైసీపీ బాధితులు శిబిరం ఏర్పాటు చేసుకుని ఆందోళనకు దిగారు.

అనంతరం గురజాల నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఓ దుశ్చర్య ఫ్యాక్షన్‌ సంస్కృతిని తలపించింది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడిని అధికార వైసీపీలో రావాలని కోరారు. ఈ విషయంలో ఆయన తర్జనభర్జన పడ్డారు. పార్టీలో చేరేందుకు ఆలస్యం చేస్తుండటంతో.. అధికార పార్టీ నేతలు కాస్త దూకుడుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. మాచవరం గ్రామంలో ఆ నాయకుడికి సంబంధించిన బొప్పాటి తోటను రాత్రికిరాత్రే ధ్వంసం చేశారు. పంట మొత్తాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఆర్థిక నష్టాన్ని మిగిల్చారు. ఈ దుశ్చర్యకి పాల్పడింది ఎవరు? అనేది అందరికీ తెలిసినప్పటికీ.. చివరకు బాధితుడు సైతం నోరు విప్పలేని పరిస్థితి.

మొత్తంమీద వైసీపీ అధికారంలోకి వచ్చాక పల్నాడు రాజకీయంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీసే సంస్కృతి రాయలసీమ నుంచి పల్నాడుకు పాకింది. ఇక హత్య చేయకుండానే.. ఆత్మహత్య చేసుకునేలా చేయడం కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చాకే కనిపించిందన్న విమర్శలు పల్నాడులో రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: