ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల కష్టాలు మామూలుగా లేవు.. రహదారులు మరమ్మత్తుల్లేక చాలా జిల్లాల్లో గోతులమయంగా మారాయి. చాలారోడ్లలో ప్రయాణం నరక ప్రాయంగా మారింది. అయితే వర్షా కాలంలో మరమ్మతులు చేయలేమంటూ సర్కారు ఏదో వివరణలు ఇస్తూ వచ్చినా.. జనంలో ఈ విషయంలో చాలా ఆగ్రహం ఉంది. అనేక మీడియా సంస్థలు కూడా ఈ రోడ్ల కష్టాలపై కథనాలు ఇచ్చాయి. దీనిపై జనసేన సోషల్ మీడియాలో ఓ క్యాంపెయిన్ కూడా నడిపింది. దీనికి మంచి స్పందన కూడా వచ్చింది.


అయితే ఇప్పుడు ఇక ఈ రోడ్డు కష్టాలు తీరే మార్గం కనిపిస్తోంది. ఏపీలో రోడ్ల మరమ్మత్తుల కోసం ప్రభుత్వం నిధులు సమీకరించుకుంటోంది. త్వరలో రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం ప్రభుత్వం రూ.2,205 కోట్లు కేటాయించిందని రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు ప్రకటించడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. సీఎం సూచనలతో ముందుగా రోడ్ల మరమ్మతులు చేపడతామని కృష్ణబాబు అంటున్నారు.


రోడ్లు బాగు చేసేందుకు నిధులు సమీకరిస్తున్నామని తెలిపిన కృష్ణబాబు.. 8,268 కి.మీ రోడ్ల మరమ్మతులకు ప్రణాళికలు సిద్దమయ్యాయని తెలిపారు.  రూ.923 కోట్లతో రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి కూడా ప్రణాళికలు రెడీ చేశామంటున్నారు కృష్ణబాబు.. మేజర్ రోడ్లను రూ.1,282 కోట్లతో చేపట్టాలని ప్రతిపాదించారట. ఇప్పటికే కొన్ని పనులకు టెండర్లు కూడా ఆహ్వానించామని కృష్ణబాబు చెబుతున్నారు. 328 రోడ్లకు రూ.604 కోట్ల విలువైన పనులు అప్పగించామంటున్నారు.


మిగతా 819 పనులకు రూ.1,601 కోట్లతో త్వరలో టెండర్లు పిలుస్తామని కృష్ణబాబు వివరించారు.
వచ్చే నెల మూడో వారంలోగా రోడ్ల పనులు ప్రారంభిస్తామని.. ఈ పనులన్నీ 2022 మే చివరి నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించామని కృష్ణబాబు తెలిపారు. అయితే ప్రభుత్వం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు బిడ్లు వేయడం లేదన్న వాదన కూడా ఉంది. ఏదేమైనా రోడ్లు బాగైతే అంతే చాలు.. అదే పదివేలు అంటున్నారు జనం.

మరింత సమాచారం తెలుసుకోండి: