నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికల వేడి కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ నేతలు ప్రచారాలతో నగరం హోరెత్తుతోంది. భారీ వర్షాల్లోనూ ప్రచారం చేస్తూ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఒకవైపున ప్రచారం చేస్తూనే మరొక వైపు రాజకీయాలు చేస్తున్నారు నెల్లూరు వైసీపీ నేతలు. ఈ రాజకీయాల ఫలితంగానే 8 డివిజన్లు వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థులే వచ్చి వైసీపీ కండువాలు కప్పుకునేలా వ్యూహాలు రచించారు ఇక్కడి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు. దీంతో నెల్లూరు జిల్లా టీడీపీ నేతలకు అసలేం జరుగుతుందో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.
వైసీపీ రాజకీయాలో షాక్ తగిలిన టీడీపీ ఆందోళనలు, నిరసనలు తెలిపింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నెల్లూరుకు వచ్చి ఈ తతంగాన్ని పరిశీలించారు. వైసీపీ నేతల రాజకీయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. వైసీపీ నేతల దౌర్జన్యాలకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతోందని..ఇలాంటి ఘోరమైన ఎన్నికలను తామెన్నడూ చూడలేదని అంటున్నారు టీడీపీ నేతలు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికలు జరగకముందే వైసీపీ పై చేయి సాధించడంతో, నెల్లూరు జిల్లాలో వైసీపీ క్యాడర్ కూడా ఉత్సాహంగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి