తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో.. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మొత్తం 13మంది మరణించారు. ఈ ఘటనలో ఐఏఎఫ్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన తీవ్రగాయాలతో మిలటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. ఈ ఏడాదే శౌర్య చక్ర అవార్డు అందుకున్నారు. గతేడాది ఎల్ఏసీ తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఎమెర్జెన్సీ సేవ్ చేశారు.

తమిళనాడు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన సాయి తేజ కూడా ఉన్నారు. సాయి తేజ స్వస్థలం కురబలకోట మండలం ఎగువరేగడ. ఈయన బిపిన్ రావత్ కు వ్యక్తిగత భద్రతా అధికారిగా పనిచేస్తున్నారు. రక్షణ శాఖలో లాన్స్ నాయక్ గా ఉన్నారు. రావత్ తో కలిసి తమిళనాడులోని వెల్లింగ్టన్ వెళ్తుండగా హెలికాప్టర్ కూలి ప్రాణాలు కోల్పోయారు.

ఇక సీడీఎస్ బిపిన్ రావత్ గతంలో జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. 2015 ఫిబ్రవరి 3న నాగాలాండ్ లోని దిమాపుర్ పర్యటనకు ఆర్మీ హెలికాప్టర్ లో బయల్దేరారు. ఇంజిన్ లో టెక్నికల్ ఇష్యూవల్ల ఆ చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటన నుంచి రావత్, మరో ఇద్దరు పైలట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు అప్పుడు ఆయన లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్నారు. ఈ రోజు జరిగిన హెలికాప్టర్ ప్రమదంలో కన్నుమూశారు.

అయితే సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పవర్ ఫుల్ హెలికాప్టర్ కూలడానికి కారణమేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. సాంకేతిక లోపం వల్ల కూలిందా.. లేక ఎవరైనా రావత్ ను టార్కెట్ చేసి మిస్సైల్ దాడికి పాల్పడ్డారా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి యావత్ దేశం కన్నీటి నివాళి అర్పిస్తోంది.









మరింత సమాచారం తెలుసుకోండి: