రావాలి జగన్.. కావాలి జగన్.. ఇది గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ ప్రచారంలోకి తెచ్చిన నినాదం.. ఆ తర్వాత జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ కూడా ఇదే నినాదానికి పేరడీ నినాదాలు తీసుకొచ్చింది. పోవాలి జగన్.. దిగిపోవాలి జగన్ అంటూ కొన్నాళ్లు ట్రోల్ చేశారు. ఇప్పుడు టీడీపీ అదే తరహాలో మరో కొత్త నినాదం ప్రచారంలోకి తెస్తోంది. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ధరలు దిగిరావాలి....జగన్ దిగిపోవాలి అంటూ కొత్త నినాదంతో టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది.


నిత్యాసర సరుకులు ధరల తగ్గించాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. పెరిగిన నిత్యవసరాల ధరలు, సంక్రాంతి కానుక రద్దు అంశాలపై ఆందోళనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఇప్పటికే విద్యుత్ బిల్లులు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెరిగిపోయాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఇలా వరుస రేట్ల పెంపుతో సామాన్యులపై పెనుభారం పడిందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.


నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. పేద ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో  ధరల నియంత్రణలో జగన్ రెడ్డి దారుణంగా విఫలమయ్యారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
అదే తమ హయాంలో అయితే సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుక.. ఇలా పండుగల సమయంలో పేదలకు కానుకలు అందించామని గుర్తు చేస్తున్నారు.


చంద్రబాబు పాలనలో ఇచ్చిన సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలను జగన్ అధికారంలోకి వచ్చాక రద్దు చేయటాన్ని తెలుగు దేశం తప్పుపడుతోంది. తక్షణమే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా.. ధరలు దిగిరావాలి....జగన్ దిగిపోవాలి... నినాదంతో జోరుగా నిరసనలు చేపట్టాలని టీడీపీ  పార్టీ కార్యకర్తలను ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: