ఇటీవల ఇంధన రేట్లు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. ఆ తర్వాత ఆర్టీసీలు కూడా ప్రయాణికులపై ఆ భారాన్ని మోపాయి. ఏపీలో ఒకసారి చార్జీలు పెంచితే, తెలంగాణలో ఇప్పటికే రెండుసార్లు చార్జీలు సవరించారు. దీంతో బస్ పాస్ ల రేట్లు పెరిగిపోయి విద్యార్థులు, చార్జీలు పెరిగిపోయి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మూలిగే నక్కపై తాటిపండులా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ప్రయాణికులపై అదనపు భారం మోపేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ ప్రజలకు మరోమారు షాక్ ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీ రెడీ అయిందని తెలుస్తోంది. ఇంధన చార్జీలు పెరగడంతో ప్రయాణీకులపై మళ్లీ భారం మోపేందుకు టీఎస్ఆర్టీసీ సిద్దమవుతోందని అంటున్నారు. ఇప్పటి వరకు రౌండ్ ఫిగర్, డీజిల్ సెస్, టోల్ సెస్, ప్యాసింజర్ సేఫ్టీ సెస్ అంటూ టీఎస్ఆర్టీసీ దాదాపుగా 35శాతం మేర చార్జీలను పెంచింది. ఇప్పటికే దీనివల్ల సామాన్యులు అదనపు భారం మోస్తున్నారు. కానీ ఇంకా ఆర్టీసీ నష్టాల్లోనే ఉంది. దీంతో మరోసారి టికెట్ ధరలను పెంచేందుకు యాజమాన్యం రెడీ అయినట్టు తెలుస్తోంది. సగటున మరోసారి టికెట్ రేటుని 20 నుంచి 30 శాతం వరకు పెంచుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందట.

డీజిల్ సెస్ రూపంలో ఇప్పటికే రెండుసార్లు టికెట్ రేట్లు పెంచారు. దీంతో ఇకపై ధరలు పెరిగే అవకాశం లేదని అనుకున్నారంతా. కానీ అంతలోనే మరోసారి టికెట్ ధరలు పెంచేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమవుతోంది. కొత్తగా చేసిన ప్రతిపాదనల ప్రకారం 100 కిలోమీటర్ల లోపు చేసే ప్రయాణాలపై 30 శాతం టికెట్ రేట్లు పెరుగుతాయి. పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులకు ఇది వర్తిస్తుంది. వీటిలో 100 కిలోమీటర్ల లోపు ఉండే ప్రయాణాలపై భారీగా అంటే.. 30 శాతం వడ్డింపు ఉంటుంది. ఇక దూర ప్రాంతాల వారిని కూడా వదిలిపెట్టడంలేదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో టికెట్ పై 20శాతం పెంపు ఉంటుందని తెలుస్తోంది. డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో చార్చీలను 20శాతం వరకు పెంచుతారు. దీంతో రోజువారీ నష్టాలను కొంతమేర తగ్గించవచ్చని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే తక్కువ సమయంలోనే ఇలా వరుసగా టికెట్ రేట్లు పెంచడం మాత్రం కాస్త గందరగోళంగా మారింది. ప్రయాణికులు ఇప్పటికే అవస్థలు పడుతున్నారు. వారినుంచి ఇకపై నిరసనలు పెల్లుబికే ప్రమాతం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: