ఏపీలో సరఫరా అయ్యే మద్యంలో విషయం లేదని, హెరిటేజ్ పాలలోనే విషం ఉందని మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకి చెందిన హెరిటేజ్‌ కంపెనీ పాలను కేరళ, తమిళనాడుల్లో 2012లో నిషేధించారని గుర్తు చేశారు నాని. అది వాస్తవమో కాదో, చంద్రబాబు ధైర్యంగా ఒప్పుకోవాలన్నారు. ఆ పాలు తాగితే జబ్బులు వస్తాయని వాటిని అక్కడ నిషేధించారని చెప్పారు. చిన్న పిల్లలు తాగే పాలలో విషం కలపడానికి చంద్రబాబుకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు నాని. 10 కోట్ల రూపాయలతో హెరిటేజ్‌ కంపెనీ పెడితే.. అది ఇప్పుడు 10 వేల కోట్ల రూపాయల కంపెనీ ఎలా అయ్యిందని ప్రశ్నించారు.

టీడీపీ ఒక కల్తీ పార్టీ అని, కల్తీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబేనంటూ విమర్శించారు కొడాలి నాని. చంద్రబాబు ఒళ్లంతా కుళ్లు,  కుట్రలు, కుతంత్రాలేనని అన్నారు. వాటితోనే ఆయన ఒళ్లంతా కుళ్లిపోయిందని చెప్పారు. చంద్రబాబు ఒక కల్తీ నాయుడని, కల్తీ నాయకుడని మండిపడ్డారు నాని. ఆయన మాట్లాడేవన్నీ కల్తీ మాటలేనని చెప్పారు. ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన టీడీపీని చంద్రబాబు కబ్జా చేశారని, ఇప్పుడు ఆ పార్టీని ఆయన తనదిగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలోని మద్యంలో విషం లేదని, చంద్రబాబు బుర్రలోనే విషం ఉందని చెప్పారు నాని.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ విధంగా కల్లోలం సృష్టించాలని టీడీపీ ఆలోచిస్తోందని, పవన్ కల్యాణ్ కూడా వారికి జతకలిశారని విమర్శించారు నాని. వారి అనుకూల మీడియాతో సీఎం జగన్‌ ను తిట్టాలి? ఆయనపై ఎలా వ్యతిరేకత తేవాలి? ఏ విధంగా తమ ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్ట పాలు చేయాలి? అనే విషయాలపై చర్చలు జరుపుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబును దొడ్డిదారిలో తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు వారి అనుకూల మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు నాని. ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియా ఏకమై జగన్ పై విషం కక్కుతున్నారని విమర్శించారు. గతంలో మత కల్లోలాలు సృష్టించాలని అనుకున్నారని, ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, కోనసీమ జిల్లా అల్లర్ల వ్యవహారం అందులో భాగంగానే జరిగిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: