ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్ల విషయంలో సాక్షాత్తూ మంత్రులు చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఆమధ్య నెల్లూరు ప్లీనరీలో మంత్రి అంబటి రాంబాబు నోరు జారారు. తాజాగా కాకినాడ ప్లీనరీలో మరో మంత్రి దాడిశెట్టి రాజా మరో అడుగు ముందుకేసి, మరింత దారుణంగా మాట్లాడారు. అసలు మంత్రులకు ఏమైంది. వాలంటీర్లను వైసీపీ కార్యకర్తల్లా చూస్తున్నారా, నెలనెలా ఇచ్చే 5వేల రూపాయలు తమ జేబులోనుంచి ఇస్తున్నట్టు భావిస్తున్నారా..? కేవలం 5వేల పారితోషికానికి తమ శక్తికి మించి పనిచేస్తున్న వాలంటీర్లను మరీ ఇంత దారుణంగా ఆడిపోసుకోవాలా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

దాడిశెట్టి రాజా కామెంట్స్ ఏంటంటే..?
కాకినాడలో జరిగిన వైసీపీ ప్లీనరీలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వాలంటీర్లు తాము నియమించిన చిన్న బచ్చా గాళ్లు అని అన్నారాయన. వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు, నాయకులపై పెత్తనం చెలాయించాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇటీవల కొంతమంది నేతలు, కార్యకర్తలు వాలంటీర్లపై చేసిన ఫిర్యాదుకు ఆయన బదులిచ్చారు. వాలంటీర్ల వల్ల కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని చెప్పిన మంత్రి రాదా.. వాలంటీర్లను మనమే పెట్టాం, వాళ్లు మీకు నచ్చకపోతే తీసేయండి.. అంటూ కార్యకర్తలకు ఉద్భోదించారు. వార్డు సచివాలయాలను కార్యకర్తలు కంట్రోల్‌ లోకి తీసుకోవాలని కూడా ఆయన మాట్లాడినట్టు సమాచారం. వాలంటీర్లను తీసేయండి అనే మాటలే ఇప్పుడు సంచలనంగా మారాయి.

వాలంటీర్లు ఎవరి మాట వినాలి, ఎవరు చెప్పినట్టు పనిచేయాలి. వాలంటీర్లు సచివాలయాలకు బాధ్యులుగా ఉంటారు. సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీ లేదా వార్డు అడ్మిన్, వీఆర్వోలు.. ఇతర ఉద్యోగులు వాలంటీర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటుంటారు. వారు చెప్పినట్టే వాలంటీర్లు తమ విధులు నిర్వహిస్తుంటారు. వాలంటీర్ల నియామకం, ఇతర వ్యవహారాలన్నీ ఎంపీడీవో పరిధిలో ఉంటాయి. మరి కార్యకర్తలకు మధ్యలో ఏం పని. వైసీపీ కార్యకర్తలు చెప్పినట్టు చేయకపోతే వాలంటీర్ల ఉద్యోగాలు తీసేస్తారా..? ఇప్పటి వరకూ జన్మభూమి కమిటీలపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు, వాలంటీర్ వ్యవస్థని కూడా అలా చేయాలనుకుంటున్నారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: