మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ చిచ్చుపెడుతున్నారా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ చాలా బలంగా ఉంది. 2014లో ఇక్కడ వైసీపీ తరపున పోటీచేసిన జోగి రమేష ఓడిపోయారు. అప్పుడు టీడీపీ తరపున దేవినేని ఉమ గెలిచారు. 2019 ఎన్నికల్లో మైలవరంలో ఎలాగైనా గెలవాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జోగిని బీసీలు ఎక్కువున్న పెడనకు మార్చి,  కమ్మ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మైలవరంలో ఆర్ధికంగా పటిష్ట స్ధితిలో ఉన్న వసంత కృష్ణప్రసాద్ కు టికెట్ ఇచ్చారు.





జగన్ వ్యూహం ఫలించి పెడనలో జోగి, మైలవరంలో వసంత ఇద్దరు గెలిచారు. ఎప్పుడైతే జోగి మంత్రయ్యారో అప్పటినుండే మంత్రి కన్ను మళ్ళీ  మైలవరం మీదపడింది. రాబోయే ఎన్నికల్లో తాను మైలవరం నుండి పోటీచేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.  మంత్రి ప్రయత్నాలను వసంత అడ్డుకోవటంతో ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. సజ్జల సమక్షంలో ఇద్దరి మధ్య రాజీకి ఎన్నిప్రయత్నాలు జరిగినా సాధ్యంకావటంలేదు. ప్రశాంతంగా ఉన్న మైలవరంలో చిచ్చుపెడుతున్నది జోగి రమేషే అని పార్టీవర్గాలు చెబుతున్నాయి.





మైలవరంకు చెందిన జోగి 2009, 2019లో గెలిచింది పెడన నుండే. అయితే తన సొంత నియోజకవర్గమైన మైలవరంలో గెలవాలన్నది జోగి పట్టుదల. తాను సిట్టింగ్ కాబట్టి తనను కాదని మరొకరికి టికెట్ ఎలా ఇస్తారన్నది వసంత లాజిక్. ఈ ఇద్దరి గొడవల మధ్య పార్టీ దెబ్బ తినేస్తోంది. తాజాగా మంగళవారం కూడా సజ్జల దగ్గర పెద్ద పంచాయితీయే జరిగింది.





వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగిపోతున్న కారణంగా వీళ్ళ మద్దతుదారులు ఇద్దరు నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. దాంతో జనాలకు వీళ్ళపై వ్యతిరేకత పెరిగిపోతోంది. వీళ్ళ పంచాయితి చివరకు పోలీసుస్టేషన్లకు కూడా ఎక్కుతోంది. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గనుక జోక్యం చేసుకుని సమస్యను పర్మినెంటుగా పరిష్కరించకపోతే చేజేతులా నియోజకవర్గాన్ని కోల్పోవటం ఖాయమనే అనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: