మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ సింగ్ నగర్ లో నిన్న ప్రచారం నిర్వహించిన సీఎం జగన్ కు నిన్న చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. పదునైన వస్తువుతో సీఎం జగన్ పై దాడి జరగగా పోలీసులు ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్ ను సైతం పరిశీలిస్తున్నారు.
 
గంగానమ్మ గుడి, వివేకానంద స్కూల్ మధ్య ఉన్న చెట్ల దగ్గర నుంచి జగన్ పై దాడి జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కుడివైపు వేల సంఖ్యలో జనం ఉండటంతో నిందితుడు స్కూల్, గుడి మధ్య ఉన్న చెట్ల ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. చెట్లు ఉండటం, చుట్టూ చీకటిగా ఉండటంతో సులువుగా తప్పించుకోవచ్చని నిందితుడు భావించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
30 అడుగుల దూరం నుంచి ఆగంతకుడు జగన్ పై దాడి చేసినట్టు తెలుస్తోంది. బస్సు యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తూ ఉండటాన్ని గమనించిన నిందితుడు ముందస్తు కుట్ర, ప్రణాళికలో భాగంగా జగన్ పై దాడి చేశాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ గన్ తో జగన్ పై హత్యాయత్నం చేశారని పలువురు వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు.
 
పదునైన వస్తువు సీఎం జగన్ వైపు వేగంగా దూసుకొనిరావడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాను సౌండ్ విన్నానని దాడి కోసం ఎయిర్ గన్ ను వినియోగించి ఉండవచ్చని కామెంట్లు చేస్తున్నారు. సీఎం జగన్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దాడి చేసిన వ్యక్తి దొరికితే ఎందుకు దాడి చేశాడనే ప్రశ్నకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. రాయి కొద్దిగా కిందకు తగిలి ఉంటే జగన్ కంటికే ప్రమాదం కలిగి ఉండేదని విమర్శించే వాళ్లు ఆచితూచి మాట్లాడితే మంచిదని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: