- వినుకొండ‌, మాచ‌ర్ల‌, ఎర్ర‌గొండ పాలెం నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ‌రం
- 1996లోనే శంకుస్థాప‌న చేసిన చంద్ర‌బాబు
- ఎంపీ లావు శ్రీకృష్ణ అహ‌ర్నిశ‌లు పోరాటం

( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ )

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌పై వరికపుడిసెల వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. ఇదివరకే దీనికోసం సుమారు 50 లక్షల రూపాయ‌ల‌ బడ్జెట్‌ను కేటాయించారు. ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే గుంటూరు జిల్లాలోని మాచర్ల ప్రాంతంలో అదనంగా 30 వేల హెక్టార్లకు సాగునీరు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి వరికపుడిసెల జలసాధన సమితి సైతం ఆవిర్భవించింది.


1996 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ‌రిక‌పూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పనులు పెద్దగా చేపట్టలేదనేది వాస్త‌వం. దీనినే వరికపుడిసెల జలసాధన సమితి నాయకులు కూడా చెబుతున్నారు. ప్ర‌భుత్వాలు మారినా.. ప‌ల్నాడు ప్ర‌జ‌ల జ‌ల క‌ష్టాలు మాత్రం తీర‌డం లేదు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో పనుల్లో కదలిక వ‌చ్చింది. అయితే.. ఆయ‌న మ‌ర‌ణంతో మ‌ళ్లీ ఆగిపోయింది.


ఆ తరువాత మళ్లీ ఈ ఎత్తిపోతల పథకం మొదటికొచ్చింది. అప్పటి నుంచీ జలసాధన సమితి నాయకులు తరచూ పల్నాడు ప్రాంతంలో ఉద్యమాలను నిర్వహిస్తూ వచ్చారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా ప్రతిపాదించిన వరికపుడిసెల ఎత్తిపోతల పథకానికి గ‌త వైసీపీ ప్ర‌భుత్వం కొంత మేర‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ఎత్తిపోతల పథకాన్ని వాస్త‌వానికి 2021 నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం క్యాలెండర్‌ను ప్రకటించింది.


కేంద్రం నుంచి అప్ప‌టి ఎంపీ (ప్ర‌స్తుతం టీడీపీ ఎంపీ) కృష్ణ‌దేవ‌రాయులు నిధులు కూడా స‌మ‌కూర్చారు. కానీ, కార‌ణాలు ఏవైనా.. ఈ ప్రాజెక్టు మాత్రం ముందుకు సాగ‌డం లేదు. ఈ ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వస్తే బొల్లాపల్లి, వెల్దుర్తి, పుల్లల చెరువు, మాచర్ల ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయనేది ఉద్యమ నేతల వాదన. సుమారు రెండు లక్షల ఎకరాలకు పైగా సాగునీటితో పాటు ఆ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చే ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు స‌ర్కారు దీనిని పూర్తి చేస్తుందా ?  లేదా? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: