
కేసుల పరంపర
ప్రస్తుతం వైసీపీ నాయకులపై కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. దీనికి కారణాలు ఏవైనా, నాయకులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఒక కేసునుంచి బయటపడగానే మరో కేసు, ఒక కేసులో బెయిల్‌పై విడుదల కాగానే ఇంకో కేసులో పోలీసులు నోటీసులు ఇవ్వడం నిత్యకృత్యంగా మారింది. ఈ పరిణామాలతో రాజకీయం అంటేనే నాయకులు భయపడే పరిస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మౌనంగా నాయకులు ...
ఈ నేపథ్యంలో కొంతమంది నాయకులు మౌనంగా ఉండిపోతే ఏ సమస్యా ఉండదని భావిస్తున్నారు. అందుకే వైసీపీలోని చాలా మంది కీలక నాయకులు మౌనంగానే ఉంటున్నారు. ఇలాంటి వారిని పోలీసులు, ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. వీరిలో గతంలో తప్పులు చేసిన నాయకులు కూడా ఉన్నా వారు ప్రస్తుతం సేఫ్‌గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలా మౌనంగా ఉండటం వల్ల పార్టీ అధినేతకు, కార్యకర్తలకు దూరం అవుతున్నారు. కార్యకర్తలు కూడా అంత ఉత్సాహంగా లేరు, నాయకులను పెద్దగా పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై ఉక్కుపాదం
మరోవైపు, పార్టీ అధిష్టానం నుంచి కూడా మౌనంగా ఉన్న నాయకులపై విమర్శలు, హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో కొందరు నాయకులు మళ్లీ దూకుడు పెంచి, ప్రభుత్వంపై విమర్శలు చేయడం, పోలీసులపై విరుచుకుపడటం, జగన్ ప్రజల మధ్యకు వస్తే కార్యకర్తలను సమీకరించడం చేస్తున్నారు. ఇలా చేసిన వారిపై ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. ఫలితంగా వారిపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఒక కేసులో ఏదో ఒక రకంగా బయటపడితే, మరో కేసు వెంటాడుతోంది.
జగన్ పర్యటనలంటే భయం
ఈ పరిణామాలతో వైసీపీ నాయకులు తల్లడిల్లుతున్నారు. అటు కార్యకర్తల కోసం నోరు చేసుకుంటే ప్రభుత్వం నుంచి చిక్కులు, ఇటు ప్రభుత్వం కోసం సైలెంట్‌గా ఉంటే కార్యకర్తలు, అధిష్టానం నుంచి సెగ. ఈ పరిస్థితి వారికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. జగన్ పర్యటనలు అంటేనే భీతిల్లే పరిస్థితి వచ్చిందని కొందరు నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారని సమాచారం. మున్ముందు కూడా ఇదే విధానం కొనసాగితే, వైసీపీ నాయకులు ఏపీని వదిలిపోయే అవకాశం ఉందన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది.