ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టంగా ఆదేశించారు. ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, ప్రస్తుత జిల్లాల సరిహద్దుల మార్పు, పేర్ల మార్పు వంటి అంశాలను పరిశీలించమని ఆదేశించారు. ముఖ్యంగా, ఈ కమిటీ వచ్చే 30 రోజుల్లో నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. అనంతరం నోటిఫికేషన్ జారీ చేసి అధికారిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ప్రాథమికంగా ఈ కమిటీ జిల్లాల వారీగా పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించాలని భావించింది. కానీ సమయం తక్కువగా ఉండటంతో ఆ నిర్ణయం విరమించుకున్నారు. దాంతో అమరావతి లేదా విజయవాడలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి, అక్కడ నుంచే మానిటరింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికీ అనువైన కార్యాలయం లభించకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.


మరోవైపు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ, కొత్త జిల్లాల అవసరం, పేర్ల మార్పు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి కూడా విభిన్న డిమాండ్లు ముందుకు వస్తున్నాయి. ఉదాహరణకు, మన్యం జిల్లాను ఇప్పటికే రెండుగా విభజించినా దానిని మూడుగా చేయాలనే అభ్యర్థనలు వస్తున్నాయి. ఇదే విధంగా హిందూపురం జిల్లాను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ కమిటీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కొన్ని జిల్లాలను విభజిస్తే తమ ప్రాంత అభివృద్ధి ఆగిపోతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లా నేతలు ఈ విభజనపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా చూస్తే, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది సున్నితమైన అంశమైందని స్పష్టమవుతోంది. ప్రజల అభిరుచులు, ప్రాంతీయ రాజకీయాలు, అభివృద్ధి అంశాలు క‌లిసినప్పుడే ఒక సమగ్ర నివేదిక రూపొందించవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: