
పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ వ్యూహాలు వంటి అంశాలపై మార్గదర్శకత్వం పొందాలని కోరుకున్నారు. అయితే జగన్ ఎప్పుడు ఏపీలో ఉంటారు, ఎప్పుడు బెంగళూరుకు వెళ్తారు అన్నది తెలియక సతమతం అయ్యే పరిస్థితి వచ్చింది. తాడేపల్లి కార్యాలయానికి ఫోన్ చేసినా కూడా సరైన సమాచారం అందడం లేదని కొందరు నేతలు ఆఫ్‌ది రికార్డ్‌గా చెబుతున్నారు. "మీకెందుకు?" అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తోందని వారు వాపోతున్నారు. ఈ పరిస్థితిలో నాయకులు ప్రణాళికలు వేసుకోవడమే కష్టమైపోతోంది. పార్టీ అధినేతను కలవలేకపోవడంతో అసహనం పెరుగుతోంది. జగన్ ప్రవర్తనలో మరో కీలక అంశం ఆయన ప్రజల్లోకి రావడాన్ని పూర్తిగా తగ్గించడం. సాధారణంగా పెద్ద పార్టీ అధినేత ఓటమి తర్వాత మరింత చురుకుగా వ్యవహరించి, ప్రజలతో కలిసిపోతారు.
కానీ జగన్ మాత్రం ఎప్పుడో మినహా ఇంటి గడప దాటి బయటకు రావడం లేదు. మీడియా ముందు కూడా ఆయన చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నా, ఆ వ్యాఖ్యలు ప్రజలకు చేరే స్థాయిలో లేవని సీనియర్ నాయకులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక స్థాయిలోనే నేతలు తామతాము ముందుకు రావాలని నిర్ణయించుకుంటున్నారు. వినాయక చవితి తర్వాత తమ నియోజకవర్గాల్లో బహిరంగ కార్యక్రమాలు ప్రారంభించేందుకు వారు సిద్ధమవుతున్నారు. అధినేత మార్గదర్శకం లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి రావడం వైసీపీ భవిష్యత్ రాజకీయాలపై ప్రశ్నార్థక చిహ్నం పెడుతోంది.