దేశ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు దేశవ్యాప్తంగా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ముఖ్యమంత్రుల పనితీరు, ప్రజాదరణ ఆధారంగా కేటాయించే ఈ ర్యాంకింగ్స్‌లో బాబు ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తుండడం రాజకీయ విశ్లేషకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది ఆగస్టులో చంద్రబాబు 5వ ర్యాంక్‌లో నిలిచారు. ఆ తర్వాత ఆరు నెలలకే 4వ స్థానం దక్కించుకున్నారు. తాజాగా ఆగస్టులో వెలువడిన సర్వేలో ఆయన మరో మెట్టు ఎక్కి 3వ ర్యాంక్ అందుకోవడం విశేషం.
 

కేవలం 15 నెలల క్రితమే నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బాబు, ఈ తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా టాప్ 3 సీఎంలలో చోటు సంపాదించడం ఆయన వేగాన్ని, పనితీరును తెలియజేస్తోంది.ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే బాబు పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉద్యోగావకాశాలు, సంక్షేమ పథకాల మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ 15 నెలల్లోనే దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించడమే కాకుండా, అంతే సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించే దిశగా అడుగులు వేశారు. దీంతో ఆయనపై ప్రజలలో విశ్వాసం, ఆదరణ గణనీయంగా పెరిగిందని ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. అదే సర్వేలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మళ్లీ దేశంలోనే అత్యుత్తమ సీఎంగా 1వ స్థానం దక్కించుకోగా, రెండో స్థానంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు.

 

ఈ ఇద్దరు నేతలు గత సర్వేలో కూడా వరుసగా 1, 2 స్థానాల్లోనే నిలిచారు. అయితే గ‌తంలో 3వ స్థానంలో ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్‌ను వెనక్కి నెట్టి, ఈ సారి బాబు ఆ సీటు కైవసం చేసుకున్నారు.ఇప్పటివరకు జరిగిన మూడు సర్వేలలో చంద్రబాబు తన స్థాయిని మెరుగుపరచుకోవడం ఆయన రాజకీయ చాతుర్యానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఊపులో వచ్చే సర్వేలో ఆయన 2వ లేదా 1వ స్థానంలోకి ఎగబాకుతారా? అన్న ఆసక్తి కూడా పెరుగుతోంది. యోగి, మమత కంటే రాజకీయంగా సీనియర్ అయినప్పటికీ మధ్యలో అధికారం చేజారడం వల్ల బాబు కొంత వెనుకబడ్డారని, కానీ ఇప్పుడు మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చి టాప్ ర్యాంక్స్ దిశగా దూసుకుపోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: