ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సెన్సేషన్ సృష్టించే పరిణామాలు మొదలయ్యాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీకి అడుగుపెట్టే విషయంలో గట్టి సంకోచంతో ఉన్నారన్న ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటూ ఆయన షరతు పెట్టడం, అదే సమయంలో చంద్రబాబుపై సవాళ్లు విసరడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. చంద్రబాబు బుద్ధి, జ్ఞానం ఉందా అంటూ జగన్ వ్యాఖ్యానించినా… అసెంబ్లీకి వెళ్లే విషయంలో ఆయన తీరు మాత్రం మారడం లేదు. ఇదిలా ఉండగా వైసీపీ ఎమ్మెల్యేల మధ్య మాత్రం వేరే లెక్కలు మొదలయ్యాయి. “జగన్ రాకపోతే మేమెందుకు రాకూడదు..? మా ఎమ్మెల్యే పదవుల్ని ఎందుకు కోల్పోవాలి..?” అన్న ఆలోచనలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని టాక్ వినిపిస్తోంది. వారిలో ఎక్కువ మంది తొలిసారి గెలిచి ఎమ్మెల్యేలయ్యారు.

ఇలాగే అసెంబ్లీకి రాకపోతే అనర్హతా వేటు పడుతుందని వారిని భయపెడుతోంది.రాజ్యాంగం ప్రకారం అరవై పని దినాలు హాజరుకాకపోతే స్పీకర్ అనర్హత వేటు వేయొచ్చు. వైసీపీ ఎమ్మెల్యేలలో కొందరు గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు కానీ అది లెక్కలో పడలేదని స్పీకర్ స్పష్టంచేశారు. పైగా కొందరు దొంగ సంతకాలు పెట్టి తప్పించుకోవాలని చూసినా అది కూడా బహిర్గతమైంది. దీంతో అనర్హతా వేటు తప్పదని వారిలో భయం మొదలైంది. ఈ నెలలో జరగబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలే అసలు టర్నింగ్ పాయింట్ కావొచ్చు. ఆరుగురు ఎమ్మెల్యేలు తమలో తాము చర్చించి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. “మేము హాజరైనా… ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడతాం. కానీ మా ఎమ్మెల్యే పదవులు కోల్పోం” అన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ నిర్ణయం తీసుకుంటే జగన్ ప్రతిష్టే పణంగా మారుతుంది. ఎందుకంటే ఆయన మాత్రం హాజరుకాకుండా ఉంటే, స్పీకర్ నేరుగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది.

 ఇక అసెంబ్లీకి రాకపోవడం వల్ల అనర్హతా వేటు పడితే… జగన్ గెలవడమే కష్టమని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ప్రజలు “తానే అసెంబ్లీకి వెళ్లని వ్యక్తికి ఎందుకు ఓటు వేయాలి..?” అని ప్రశ్నిస్తారు. ఒకవేళ ఎమ్మెల్యేలు హాజరవ్వడం మొదలుపెడితే, జగన్ పరిస్థితి మరింత క్లిష్టం అవుతుంది. మొత్తానికి జగన్ ఒక దారిలో, ఎమ్మెల్యేలు మరో దారిలో నడవడం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈసారి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఎవరు హాజరవుతారు, ఎవరు దూరంగా ఉంటారు అన్నది చూడాల్సిందే. కానీ ఒకటి మాత్రం ఖాయం… ఆరుగురు ఎమ్మెల్యేల హాజరు అయితే జగన్ పరువు రోడ్డుపై పడటమే కాకుండా, ఆయన రాజకీయ భవిష్యత్తుకే పెద్ద సవాల్ అవుతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: