
తాజా బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఒక షాకింగ్ హామీ ఇచ్చారు - “ప్రతీ ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం”! ఈ ఒక్క మాటతోనే ఎన్నికల వాతావరణం తలకిందులైంది. రెండు కోట్లకు పైగా నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంలో ఈ హామీ అంటే అసలు సాధ్యమేనా అన్నది పెద్ద ప్రశ్న. ప్రభుత్వ బడ్జెట్‌లో ఇప్పటికే జీతాలకే భారీ ఖర్చు ఉంది. అయినా కూడా తేజస్వీ ఇచ్చిన ఈ హామీ ప్రజల్లో విపరీతమైన ఆకర్షణ కలిగించింది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది “సూటిగా ఉన్నా లోపల ట్విస్ట్ ఉన్న హామీ” అంటున్నారు. ఇంటికో ఉద్యోగం అంటే, అది ప్రభుత్వమేనా లేక కాంట్రాక్ట్, క్యాజువల్ జాబ్స్ కూడా కలుపుతారా అన్నది క్లారిటీ లేదు. బహుశా గెలిచాక వాయిదా పద్ధతిలో ఇవ్వొచ్చు. ప్రతి ఏట కొంతమందికి ఇస్తూ చివరికి అర్ధం తరిగిపోయిన హామీగా మార్చొచ్చు. అంటే “అశ్వద్ధామ హత కుంజరః” స్టైల్లో చెప్పి బయటపడొచ్చు.
ఏదేమైనా ఈ హామీ బీహార్ దాటితే దేశవ్యాప్తంగా పాపులర్ అవ్వడం ఖాయం. “ఇంటికో ఉద్యోగం” అన్న హామీ ఒక్కటే ఓటర్ల మదిలో మునిగితే, రేపటి ఎన్నికల్లో ఇది ప్రతి పార్టీకి ప్రధాన మంత్రంగా మారుతుంది. గెలవాలంటే ఒక సూపర్ హామీ చాలు - దాన్ని ఎలా మలచాలో, ఎలా మడిచిపెట్టాలో మాత్రం వాళ్లకు బాగా తెలుసు! ఇంతకీ ఈ హామీ నిజంగా ఉద్యోగాలు ఇస్తుందా లేక కాగితాలపైనే మిగిలిపోతుందా? తెలియదు కానీ, రాజకీయాల్లో ఇది కొత్త బాంబే! గెలవాలంటే ఏ హామీ అయినా కరెక్ట్ - ఆ తర్వాత? “రాసుకో సాంబా... మిగిలింది మాయే రాజకీయం!”