- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. కొత్తవారిని పార్టీలోకి చేర్చుకోవాలా వద్దా ? అనే ప్రశ్న. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ అది అంతరించిపోతున్న పార్టీ, అక్కడ ఉన్నవారు ఇప్పుడే కళ్ళు తెరవాలి అంటూ కామెంట్ చేశారు. దీంతో వైసీపీ నాయకులకు టిడిపి తలుపులు తెరుచుకున్నాయా ? అన్న సందేహం మొదలైంది. గతంలో ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి టిడిపిలో చేరిన కొంతమంది నాయకులు వివాదాలకు కారణమవడంతో ఇప్పుడు అదే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. విజయవాడలో జరిగిన “ఆటో డ్రైవర్ల సేవలో” కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీ నాయకులనే ఉద్దేశించే అంటున్నారు.


గ‌త కొంత‌కాలంగా కొంద‌రు వైసీపీ నేత‌లు టీడీపీలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, “వైసీపీ నుంచి వచ్చిన వారితోనే మాకు పొస‌గ‌డం లేదు. వారు సహకరించడం లేదు, తామే కీలక స్థానాలు ఆక్రమిస్తున్నారు” అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూడా ఇటీవల స్పష్టంగా, “ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పార్టీకి నష్టం చేస్తున్నారు” అని అన్నారు. సుదీర్ఘంగా పార్టీలో ఉన్న నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ఇలాంటి పరిస్థితుల్లో, సీఎం చంద్రబాబు కొత్తవారిని పార్టీలోకి తీసుకోవడంపై ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండగా, వైసీపీకి షాక్ ఇవ్వాలంటే కొంతమంది వైసీపీ కీల‌క నాయకులను చేర్చుకోవడం అవసరమని కొందరు భావిస్తున్నారు. మరోవైపు, ఎమ్మెల్యేలు మాత్రం “ఇప్పుడే కొత్తవారిని తీసుకోవడం ప్రమాదం” అంటున్నారు. ఇలాంటి డిఫ‌రెంట్‌ అభిప్రాయాల మధ్య, చంద్రబాబు చివరకు ఏ దిశలో నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: