ఎన్నికల సీజన్ మొదలయ్యిందంటే చాలు — అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎవ్వరూ మినహాయింపు లేకుండా హామీల వర్షం కురిపిస్తారు. ఎవరి నోటికి ఏది వస్తే అది హామీగా ప్రకటించి, ప్రజల మనసు గెలుచుకోవాలన్న తపనతో కొత్త కొత్త వాగ్దానాలు చేస్తుంటారు. ఇది మనం ప్రతి రాష్ట్ర ఎన్నికల్లో చూసే సాధారణ దృశ్యం. కానీ ఈసారి మాత్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.ప్రతిపక్ష ఆర్‌జేడీ ఇచ్చిన హామీలపై అమిత్ షా ఘాటుగా స్పందిస్తూ, “ఇవి ఆచరణలో సాధ్యం కాని కలలు. ఓట్లు దక్కించుకోవడానికి నోటికి వచ్చిందల్లా హామీగా ప్రకటించడం తప్ప మరేమీ చేయడం లేదు,” అంటూ ఫైర్ అయ్యారు. “ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం” అనే ఆర్‌జేడీ వాగ్దానంపై మండిపడుతూ, “అది సాధ్యం కాని పని. ఒక రాష్ట్రంలో 2.6 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే, వారికి వేతనాలు చెల్లించడానికి సుమారు 12 లక్షల కోట్లు అవసరం అవుతాయి. కానీ బీహార్ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ మాత్రం దానికి నాలుగు రెట్లు తక్కువ. మరి ఈ హామీలు ఎలా సాధ్యం అవుతాయి? బుర్ర పెట్టి ఆలోచించారా?  నోటికి వచ్చిందల్లా చెబుతున్నారా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

శుక్రవారం పాట్నాలో జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలను తీవ్రంగా తప్పుపట్టారు. “ప్రజల కోసం నిజంగా ఏదైనా చేయాలంటే కొత్త పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురండి. కానీ అబద్ధపు హామీలతో ప్రజల విశ్వాసాన్ని దోపిడీ చేయొద్దు,” అంటూ గట్టిగా హెచ్చరించారు.అమిత్ షా మాట్లాడుతూ.." దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో చొరబాటుదారుల పేర్లు తొలగించే ప్రక్రియను మరింత కఠినతరం చేస్తామని తెలిపారు. కుటుంబ వారసత్వ రాజకీయాలను నమ్ముకుంటున్న కాంగ్రెస్‌, ఆర్‌జేడీ లాంటి పార్టీలకు ఈ ఎన్నికల్లో బీహార్ ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. “దేశ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న బీజేపీని మరోసారి గెలిపించి, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కొనసాగించండి. అభివృద్ధి బాటలో బీహార్ ముందుకు సాగాలంటే ఇది తప్పనిసరి,” అంటూ ప్రజలను కోరారు. అమిత్ షా ప్రసంగం పూర్తయ్యాక సోషల్ మీడియాలో ఆయన వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆయన చెప్పిన ప్రతి మాటలో ఉన్న లాజిక్‌, దానికి ఉన్న క్లారిటీ చూసి నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. “అమిత్ షా మాట్లాడితే క్లారిటీతోనే మాట్లాడుతారు… ఎదుటివారిని ప్రశ్నించే విధానం అద్భుతం… ఆయన మాటలకు అర్థాలే వేరులే!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఫ్యాన్స్ కూడా ఆయనను ప్రశంసిస్తూ, “ఏ విషయం అయినా సూటిగా చెప్పే నాయకుడు అమిత్ షా మాత్రమే. మాటలలో హంగు ఆర్భాటాలు ఉండవు, కానీ ప్రతి వాక్యంలో ఆలోచన ఉంటుంది,” అని పొగడ్తలు కురిపిస్తున్నారు. ఎన్నికల వేళలో ఆయన చేసిన ఈ సూటి వ్యాఖ్యలు బీహార్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.మొత్తం మీద, అమిత్ షా మాటలు ప్రజలకు, రాజకీయ పార్టీలకు కూడా ఒక కఠినమైన హెచ్చరికగా మారాయి — “హామీ ఇవ్వడం సులభం, కానీ దాన్ని నెరవేర్చడం సాధ్యం అయ్యేలా ఆలోచించండి!” అని చెప్పిన ఆయన మాటలు ఇప్పుడు బీహార్‌ రాజకీయ చర్చల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: