ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయం లోపించడంతో గ్రూపు విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, వచ్చే ఎన్నికల్లో కూటమి నేతల అనైక్యత కారణంగా ఉన్న నియోజకవర్గాలను కూడా వైసీపీకి అప్పగించినట్లే అవుతుందన్న ఆందోళన సొంత పార్టీ నుంచే వినిపిస్తోంది. మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు దక్కని అసంతృప్తులు, అంతర్గత కుమ్ములాటలు పార్టీ కార్యక్రమాలకే కాకుండా పార్టీ ప్రతిష్టకు కూడా నష్టం కలిగిస్తున్నాయి. టీడీపీలో అంతర్గత పోరు .. తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం క్రియాశీలకంగా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి దక్కడంపై సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు.

బయటకు ప్రశాంతంగా ఉన్నా, అంతర్గతంగా ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతూనే ఉన్నారన్న చర్చ నడుస్తోంది. ఈ గ్రూపు రాజకీయాలకు నిదర్శనంగా, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పౌరసరఫరాల శాఖపై తీవ్ర ఆరోపణలు చేశారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తమిళనాడుకు సరఫరా చేస్తున్న మాఫియా వెనుక ఒక టీడీపీ నేత ఉన్నాడని, అతడి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం జిల్లా టీడీపీలోనే కాక, రాష్ట్ర స్థాయి టీడీపీలోనూ చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ నాయకత్వం ఈ అంశాన్ని సెట్ చేసినట్లు కనిపించినా, అప్పటికే పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనే అభిప్రాయం ఉంది. జనసేనలో 'టిడ్కో' విలన్ .. జనసేన పార్టీలోనూ విభేదాలు తారాస్థాయికి చేరాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిడ్కో ఛైర్మన్‌గా నియమితులైన వేములపాటి అజయ్ కుమార్, నెల్లూరు జనసేన నేతలకు "విలన్"గా మారారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగబాబుకు సన్నిహితుడైన అజయ్ కుమార్, పదవి చేపట్టిన తర్వాత స్థానిక జనసేన నాయకులను కాదని, ప్రత్యర్థులకు సన్నిహితంగా మారారని ఎక్కువ మంది నేతలు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. నెల్లూరు జిల్లా 'అజయ్ బాధిత' నేతలతో ప్రత్యేకంగా సమావేశమై వారికి భరోసా ఇచ్చారు. ఈ సమావేశానికి అజయ్‌ను ఆహ్వానించకపోవడం గమనార్హం. ఫిర్యాదులు విన్న పవన్ కల్యాణ్, వేములపాటి అజయ్ కుమార్‌కు తీవ్రంగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో అధికార కూటమిలోని టీడీపీ, జనసేన నేతల మధ్య నెలకొన్న ఈ విభేదాలు, అనైక్యత జిల్లా రాజకీయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: