ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, ప్రజలకు చేరువలో పాలన అందించే లక్ష్యంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు వేగవంతమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంత్రివర్గ ఉపసంఘం తాజాగా సమావేశమై పలు కీలక ప్రతిపాదనలను చర్చించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే, భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిని జిల్లాలుగా మార్పు చేసి, 13 జిల్లాలను 26కు పెంచారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది.


ప్రతిపాదనల పరిశీలన: మార్కాపురం, మదనపల్లె .. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు, మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు రెవెన్యూ శాఖ మద్దతు పలికింది. ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాలని సీఎం గుర్తుచేశారు. అలాగే, రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మదనపల్లెను కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉపసంఘం పరిశీలనకు వచ్చింది. దీనిపై చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలతో సంప్రదింపులు జరిపి స్పష్టత తీసుకురావాలని నిర్ణయించారు. మండలాల కూర్పులో మార్పులు .. 28 నియోజకవర్గాలకు చెందిన 86 మండలాలను డివిజన్లు, జిల్లాలవారీగా మళ్లీ పునర్‌వ్యవస్థీకరణ చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ముఖ్యమైన ప్రతిపాదనలు: అన్నమయ్య జిల్లా ప్రధాన కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మార్చడం. బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం మొత్తాన్ని ప్రకాశం జిల్లాలో కలపడం. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



పోలవరం ముంపు మండలాలపై స్పష్టత .. పోలవరం నిర్మాణం పూర్తయిన తర్వాత ముంపు మండలాలను ఏ జిల్లాలో విలీనం చేయాలి అనే అంశంపై స్పష్టత తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఆయా మండలాలను ప్రధాన కేంద్రానికి దగ్గరగా ఉండే జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ కసరత్తుల తర్వాత ప్రస్తుతం ఉన్న మండలాల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అయితే, రెవెన్యూ డివిజన్లు మాత్రం నాలుగు పెరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉపసంఘం ఈ ప్రతిపాదనలపై ఈరోజు మరోసారి సమావేశమై, ఈ నెల 7వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది ప్రతిపాదనలను సమర్పించనుంది. ఆ తర్వాత అధికారిక ప్రక్రియ ప్రారంభించి, ప్రజాభిప్రాయం తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: