’కరోనా వైరస్ సంక్షోభాన్ని అధిగమించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వటానికి వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి’ ... ఇది చంద్రబాబునాయుడు తాజా డిమాండ్.  ఇదే డిమాండ్ ను ఇప్పటికి చంద్రబాబు ఓ వందసార్లయినా చేసుంటాడు. తాను డిమాండ్ చేయటమే కాకుండా తన పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల్లోని తన మద్దతుదారులతో కూడా చేయించుంటాడు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. తన డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోదని తెలిసినా సరే పదే పదే అదే డిమాండ్ ను చంద్రబాబు ఎందుకు చేస్తున్నట్లు ?

 

ఎందుకంటే ప్రచాయ యావ తప్ప మరోటి కనబడలేదు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో తనను ఎవరూ పట్టించుకోవటం లేదనే ఉక్రోషం చంద్రబాబులో ఎక్కువైపోతోంది.  చంద్రబాబు గనుక ఇపుడు అధికారంలో ఉండుంటే ఈ సంక్షోభాన్ని ఏ విధంగా టాకిల్ చేసుండోవాడో అంటూ ఎల్లోమీడియాతో ఇప్పటికే కథనాలు రాయించుకున్నాడు. అది చాలదన్నట్లుగా వైరస్ వ్యాప్తిని నియంత్రించటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిలైందంటూ ప్రతిరోజు వార్తలు రాయిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

నిజానికి చంద్రబాబు స్టైల్ ఎలాగుంటుందంటే గోరంత పనిచేసి కొండంత ప్రచారం చేయించుకుంటాడు. హుదహుద్ తుపాను, తిత్లీ తుపాను సమయంలో చేసిన పనెంత ? చేయించుకున్న ప్రచారం ఎంత ? అన్న విషయాలను జనాలందరూ చూసిందే. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో తిరిగి అమరావతిలో భారీ ఎత్తున ప్రచార కటౌట్లను పెట్టుకున్న విషయాన్ని జనాలు మరచిపోతారా ?

 

తిత్లీ తుపాను బాధితులందరినీ ఆదుకునేసినట్లు, పునరావాస కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేసినందుకు ఆ జిల్లా ప్రజలు చంద్రబాబుకు థ్యాంక్స్ చెబుతున్నట్లు ’థ్యాంక్యు సిఎం సర్ ’ అంటూ అమరావతిలో భారీ కటౌట్లను ఏర్పాటు చేసుకున్నాడు. విచిత్రమేమంటే ఇదే కటౌట్లు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా కనబడలేదు. ఇదే కటౌట్లను శ్రీకాకుళం జిల్లాలో పెట్టుంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బండారం బయటపడేదే.

 

మొన్నటికిమొన్న ప్రధానమంత్రి తనకు ఫోన్ చేసినట్లు ఎంతగా ప్రచారం చేసుకున్నాడో చూసిందే. అసలు ప్రధాని ఫోన్ చేసిన విషయమే అందరికీ డౌట్ గా ఉంది. రేపు జగన్ అఖిలపక్ష సమావేశం పెట్టినా జరిగేదిదే. సమావేశంలో ప్రభుత్వాన్ని తప్పు పడుతూ చంద్రబాబు మాట్లాడటం, ఎల్లోమీడియా రెచ్చిపోవటం ఖాయం. నిజానికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న వనరులను వైరస్ వ్యాప్తి నిరోధానికి సమర్ధవంతంగా ఉపయోగించుకుంటోంది. కానీ చంద్రబాబు మాత్రం ప్రచార యావతోనే పదే పదే అఖిల పక్ష సమావేశం కోసం డిమాండ్ చేస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: