
సీఎం జగన్ సీన్‌లోకి రావడంతో పీఆర్సీ అంశం తుది దశకు చేరుకుంది. ఇవాళ ఉద్యోగ సంఘాలతో నేడు సీఎం జగన్ కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై సమావేశంలో చర్చిస్తారు. మొత్తం 71 డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే నోటీసు ఇచ్చాయి.
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో తొలుత చర్చలు జరపనున్న సీఎం.. ఆ తర్వాత ఉద్యోగులకు ఫిట్‌మెంట్ విషయాన్ని ఖరారు చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న సీపీఎస్ రద్దు హామీపైనా సీఎం చర్చలు జరిపే అవకాశం ఉంది. అయితే కీలకమైన ఫిట్ మెంట్ అంశాన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా ఉంది. ఈ విషయంలో ఉద్యోగుల ఆశలకు.. ప్రభుత్వం ప్రతిపాదనలకూ పొంతనలేకుండా ఉంది.
మరి ఉద్యోగ సంఘాలను తాము అనుకున్న ఫిట్‌మెంట్ కు ఒప్పించడం కష్టమే. ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో పీకల్లోతు కూరుకుపోయినట్టు కనిపిస్తున్న ప్రభుత్వానికి ఈ ఫిట్‌మెంట్ భారం ఎంత తగ్గితే అంత మేలు అన్న భావన ప్రభుత్వానికి ఉంది. అయితే.. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆదాయాలు పడిపోయిన విషయాన్ని కన్విన్సింగ్‌గా చెప్పి ఒప్పిస్తారా.. లేక.. ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గి ఖజానాపై మరింత భారం వేసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.