ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఆటగాళ్లు ఒక్కక్కరిగా తండ్రులవుతున్నారు. తమ జీవితాల్లోకి కొత్త వెలుగులను ఆహ్వానించేందుకు రెడీ అవుతున్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మరికొద్ది రోజుల్లో తల్లిదండ్రులు కానున్నారన్న విషయం మనకు తెలిసిందే. అయితే వారికంటే ముందే మరో భారత పేసర్ తండ్రయ్యాడు. ఉమేశ్ భార్య, ఫ్యాషన్ డిజైనర్ తాన్యా వాధ్వా ఈ రోజు ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సరిగ్గా న్యూఇయర్ రోజున పుట్టడంతో ఉమేశ్ దంపతులు తెగ ఆనందపడుతున్నారు.  

2013లో ఫ్యాషన్ డిజైనర్‌ తన్యా వాధ్వాను ఉమేశ్ యాదవ్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరికీ కూతురు పుట్టింది. కూతురు పుట్టిన విషయాన్ని ఉమేశ్ యాదవ్ తన ట్విటర్ ఖాతా ద్వారా స్వయంగా ప్రకటించాడు. ‘నాకు కూతురు పుట్టింది’ అని చెబుతూ ఓ ఫోటోను కూడా షేర్ చేశాడు. ఆ ఫోటోపై ‘మా ప్రపంచంలోకి స్వాగతం చిన్న రాకుమారి. నిన్ను పొందినందుకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ రాసుకొచ్చాడు.

ఇదిలా ఉంటే ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇటీవల జరిగిన రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో పిక్కకు గాయం కావడంతో అర్థాంతరంగా మైదానాన్ని వీడాడు. ఆ తరువాత మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టలేదు. గాయం తీవ్రత దృష్ట్యా మిగతా రెండు మ్యాచ్‌లకూ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో భారత్ చేరుకున్న ఉమేశ్ ఈ తీపికబురును అభిమనులతో పంచుకున్నాడు.

గాయం నుంచి కోలుకునేందుకు కొన్ని రోజులు పాటు ఉమేశ్ ఇంటి వద్దే ఉండనున్నాడు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ కోసం వెళ్లనున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి తొలి వారం భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని ఉమేశ్ భావిస్తున్నాడు. మరి అతడు అప్పటికల్లా ఫిట్‌నెస్ సాధిస్తాడా..? తుది జట్టులో స్థానం సంపాదిచగలుగుతాడా..? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: